సహజంగా దానిలో ఉండే చక్కెరల కారణంగా పుచ్చకాయలను తక్కువగా తీసుకోమని డయాబెటిస్ ఉన్న వారికి సూచిస్తాము, కానీ ఈ పండులో డయాబెటిస్ ఉన్న వారికి ఉపయోగపడే రహస్యం ఉంది – వాటి విత్తనాలు. పుచ్చకాయ గింజలను సాధారణంగా పక్కన వేసేస్తుంటాం, కానీ వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి హృదయానికే కాదు డయాబెటిస్ ఉన్న వారికి కూడా అత్యంత ఆరోగ్యకరం అని నిపుణులు అన్నారు.
“సాధారణంగా ప్రతీ పండులోని విత్తనంలో అనేక పోషకాలు ఉంటాయి. ఎందుకంటే అవి కొత్త మొక్కలకు ప్రాణం పోస్తాయి,” అని అన్నారు డాక్టర్ సబ్యసాచి ముఖోపాధ్యాయ్, గోవాలోని మణిపాల్ హాస్పిటల్(Manipal Hospital)లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్.
నిపుణులు చెప్పిన దాని ప్రకారం, పుచ్చకాయ గింజలలో ఐరన్, పీచు పదార్థాలు, ప్రొటీన్ అలాగే మెగ్నీషియం అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో పాటు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి, అలాగే B, C అలాగే Eలు కూడా ఎక్కువ ఉంటాయి.
“ఈ గింజలలో ఆరోగ్యకరమైన ఒమేగా-3 అలాగే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హృదయ సమస్యలు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అలాగే కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కూడా అత్యంత ప్రయోజనకరం.” అని అన్నారు డాక్టర్ ముఖోపాధ్యాయ్. వీటిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి మంచి చిరుతిండి.
పుచ్చ గింజల నుండి గుండెకు కలిగే ప్రయోజనాలు
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు పుచ్చగింజలు అధిక రక్తపోటును, రక్తంలో అధిక చక్కెరలను అలాగే కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో ఉపయోగపడవచ్చు. వీటిలో MUFA (మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు) అలాగే PUFA (పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు) ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తాయి. అంతే కాకుండా, వీటిలో ఉన్న మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
360 డిగ్రీ నూట్రీకేర్ (360 Degree Nutricare) (e-క్లినిక్) స్థాపకులు అలాగే పోషకాహార నిపుణులు దీపలేఖ బెనర్జీ మాట్లాడుతూ, ఈ గింజలలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు వాసోడైలేటర్లుగా (రక్త నాళాల సంకోచ వ్యాకోచలను నియంత్రించేవి) పనిచేస్తాయి, దీని వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనితో పాటు, వీటిలో ఉన్న ఐరన్ రక్తం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే జింక్ హృదయంలో కాల్షియం కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది అని అన్నారు.
హైదరాబాద్ కామినేని హాస్పిటల్స్(Kamineni Hospitals) సీనియర్ ఎండోక్రనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రెడ్డి, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని వివరించారు. పుచ్చగింజలను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ నియంత్రణలో ఉంటుంది అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరగకుండా ఉంటాయి, దీని వలన హృదయ నాళాల సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
డయాబెటిస్ నియంత్రణలో పుచ్చగింజల ప్రాముఖ్యత
పుచ్చగింజలు రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి ఇవి డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఆహారం. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీ (శరీరంలోని కణాలు ఇన్‌స్యూలిన్‌కు స్పందించే తీరు) మెరుగుపరుస్తాయి. వీటిలో ఉన్న మెగ్నీషియం కార్బోహైడ్రేట్ మెటబాలిజాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది కాబట్టి దీని వలన రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. “మెగ్నీషియం అనేది ఇన్సులిన్ విడుదల అలాగే కార్బోహైడ్రేట్ మెటబాలిజంకు కీలకమైన పోషకం”అని డాక్టర్ రెడ్డి అన్నారు.
డయాబెటిస్ ఉన్న పుచ్చగింజలు అలాగే పుచ్చకాయలను మితంగా తీసుకోవచ్చు అని నిపుణులు అన్నారు. పుచ్చకాయలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి, గ్లైసిమిక్ లోడ్ (దీనిని తిన్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయులలో వచ్చే పెరుగుదల అంచనా) తక్కువ. వీటిలో నీటి శాతం ఎక్కువ. అయితే, చక్కెర కలిపిన పుచ్చకాయ రసాన్ని త్రాగడం మంచిది కాదు అని హెచ్చరించారు.
మీ ఆహారంలో పుచ్చకాయ గింజలను తీసుకోండి
తెలుపు మరియు నలుపు పచ్చకాయ గింజలు రెండూ ఆరోగ్యకరమే అని అన్నారు బెనర్జీ. అలాగే, ఈ గింజలలో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి బియ్యం, చపాతీ లేదా కూరగాయల వంటి సాధారణ ఆహారంలో లభించవు. కాబట్టి ఇవి మీ ఆహారంలో మంచి ఎంపిక.
పుచ్చగింజలను పచ్చిగా లేదా వేయించి తినవచ్చు. వీటిని పుచ్చకాయల నుండి వేరు చేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత, ఈ గింజలను సలాడ్లు అలాగే సాండ్‌విచ్‌లలో వేయవచ్చు లేదా విడిగా కూడా తినవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- పుచ్చకాయల గింజలలో ఖనిజాలు అలాగే యాంటి-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు అలాగే ఊబకాయం ఉన్న వారికి అత్యంత ప్రయోజనకరం.
- ఈ గింజలలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే, వీటిలోని ఇనుము రక్తం ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, జింక్ గుండెలో కాల్షియం కదలికను నియంత్రిస్తుంది.
- ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపరచడంతో పాటు, ఈ గింజలు కార్బోహైడ్రేట్ మెటబాలిజంను అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
- పుచ్చకాయ గింజలను చిరుతిండిగా తినవచ్చు. లేదా వీటిని ఎండబెట్టి సలాడ్లు అలాగే సాండ్‌విచ్‌లలో వేసుకోవచ్చు.