మూత్రపిండాల్లో లవణాలు, ఖనిజాల పరిమాణం పేరుకున్నపుడు రాళ్లు ఏర్పడతాయి. తగినన్ని నీళ్లు తాగకపోవడం, అధిక సోడియం ఆహారం వంటివి ముప్పు కారకాలు.

అమెరికాలోని ఓ సముద్ర ఉత్పత్తుల పరిశ్రమలో పనిచేసే ఇరవై ఆరేళ్ల రిచర్డ్‌కు (అభ్యర్థనపై పేరు మార్చబడింది) మూత్రపిండాల్లో రాయి ఉన్నట్లు 2016 నవంబరులో తొలిసారి నిర్ధారణ అయింది.
అది 9 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నందువల్ల దానికదే పడిపోవడం వీలుకాదు కాబట్టి, లేజర్ లిథోట్రిప్సీ ప్రక్రియ (రాళ్లను చిన్న ముక్కలు చేసి, కిడ్నీ–మూత్రాశయం–మూత్రమార్గం–మూత్రనాళాల ద్వారా తొలగించే చికిత్స) చేయించుకోవాల్సిందిగా వైద్యులు అతనికి సూచించారు.
“దైనందిన జీవితంతోపాటు ఉద్యోగ బాధ్యతలపై దుష్ప్రభావం పడటమే మూత్రపిండాల్లో రాళ్లవల్ల కలిగే అతిపెద్ద కష్టం” అని రిచర్డ్ ‘హ్యాపీయెస్ట్ హెల్త్’తో చెప్పాడు. “విపరీతమైన నొప్పి, కడుపులో వికారం వల్ల పనిచేయడం నాకు కష్టమైపోయింది. లిథోట్రిప్సీ తర్వాత కోలుకునేసరికి నేను గణనీయంగా బరువు తగ్గి, సహోద్యోగులకు అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించాను.
అయితే, 2021లో రిచర్డ్ కిడ్నీలో రాళ్లున్నట్లు మరోసారి నిర్ధారణ కావడంతో అతని జీవితం మళ్లీ గాడితప్పింది.
“మొదటిసారి నొప్పి భరించశక్యం కాలేదు. చికిత్స తర్వాత కోలుకుని, మళ్లీ పనిలో చేరేసరికి 20-30 పౌండ్ల (సుమారు 9-13 కిలోలు)దాకా బరువు తగ్గాను. రెండోసారి రాళ్లతో చాలా ఇబ్బంది కలిగినప్పటికీ ఎలాగోలా తట్టుకోగలిగాను” అని తెలిపాడు.
రెండోదఫాలో కిడ్నీ సమస్య లక్షణాలను ఎదుర్కొనడం ద్వారా ఇంట్లోనే ఉండి నిభాయించుకోగలిగానని రిచర్డ్ చెప్పాడు. “మూత్ర విసర్జన భావన పదేపదే తలెత్తుతుంటే పనిచేయడం చాలా కష్టంగా ఉండేది” అని గుర్తుచేసుకున్నాడు.
మూత్రపిండాల్లో రాళ్లకు కారణాలు
మూత్రంలోని అధిక సాంద్రతగల విసర్జకాలు స్ఫటికాలుగా మారడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని హైదరాబాదులోని ఎల్.బి.నగర్‌లోగల ‘కామినేని హాస్పిటల్స్’ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎ.సంతోష్ కుమార్ చెప్పారు.
మన మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను నాలుగు రకాలుగా– కాల్షియం, స్ట్రువైట్ (మెగ్నీషియం అమ్మోనియం ఫాస్ఫేట్), యూరిక్ యాసిడ్, సిస్టీన్ (అమైనో యాసిడ్) రాళ్లుగా వర్గీకరించినట్లు బెంగళూరులోని ‘ఎం.ఎస్.రామయ్య మెడికల్ కాలేజీ హాస్పిటల్’ యూరాలజీ–ఆండ్రాలజీ–మూత్రపిండ మార్పిడి–రోబోటిక్ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ ప్రొఫెసర్ తరుణ్ జావలి చెప్పారు.
మూత్రపిండాల్లోని రాళ్ల లక్షణాలు
డాక్టర్ జావలి వివరణ ప్రకారం– మూత్రపిండాల్లోని రాయి సాధారణంగా మూత్రపిండంలో కదులుతున్నంత వరకూ లేదా మూత్ర నాళాల్లోకి వెళ్లేవరకూ ఎటువంటి లక్షణాలూ కనిపించవు. వీటి ఉనికిని తెలిపే కొన్ని సాధారణ లక్షణాలను ఆయన ఇలా వివరించారు:
- పక్కటెముకల దిగువ, పక్కన, వెనుక భాగంలో చురుక్కుమనే తీవ్రమైన నొప్పి
- పొత్తికడుపు, గజ్జల్లోకి వ్యాపించే నొప్పి
- తెరలుతెరలుగా వచ్చే నొప్పి- తీవ్రతలో హెచ్చుతగ్గులు
- మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట
- నొప్పితో ముడిపడిన వికారం-వాంతులు
మూత్రపిండాల్లో రాళ్ల నిర్ధారణ
మూత్రపిండాల్లో రాయి ఉందని సందేహం వస్తే ప్రాథమిక వైద్య పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ, సీటీ (కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ) స్కాన్ ద్వారా నిర్ధారించవచ్చునని డాక్టర్ జావలి చెప్పారు.
రాళ్లను గుర్తించడంలో అల్ట్రాసౌండ్ అత్యంత సునిశితమైనది కాగా, ఎక్స్-రే తీయడం ద్వారా కాల్షియం రాళ్ల ఉనికిని గుర్తించగలమని డాక్టర్ సంతోష్ కుమార్ చెప్పారు. అయితే, రాయి పరిమాణంతోపాటు అదెక్కడున్నదో కూడా సీటీ స్కాన్ స్పష్టంగా చూపుతుందని, తద్వారా ఏ చికిత్స విధానం అవసరమో వైద్యులు నిర్ణయించగలరని ఆయన తెలిపారు.
కిడ్నీలో రాళ్ల ముప్పు ఎవరికి ఎక్కువ?
కిడ్నీలో రాళ్ల సంబంధిత కుటుంబ లేదా వ్యక్తిగత చరిత్ర ముప్పు పెంచే కారకాల్లో ఒకటని డాక్టర్ జావలి చెప్పారు. కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండాల్లో రాళ్లుండటం లేదా వ్యక్తులకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా మూత్రపిండాల్లో రాళ్లు గతంలో ఏర్పడి ఉంటే మరొకటి ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు.
రిచర్డ్ విషయంలో ఇది వాస్తవం… అతను రెండుసార్లు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి నొప్పి, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
“ప్రస్తుత లక్షణాలను బట్టి నాకు తెలిసి ఇంకా రాయి బయటపడలేదు” అని అతను చెప్పాడు. “మునుపటి రాళ్ల సమస్య తరహాలోనే నొప్పికలిగే ప్రాంతం, తీవ్రత ఒకేవిధంగా ఉన్నాయి. ఇప్పుడు నొప్పి తగ్గిందిగానీ, పూర్తి నిర్ధారణ కోసం నేను ఈ వారం తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తాను” అని చెప్పాడు.
“నేను సెలవులో ఉన్నపుడు తాజాగా సమస్య మొదలైంది. అయితే, నేను బాగా విశ్రాంతి తీసుకున్నందువల్ల పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంది. అయినప్పటికీ నొప్పి వల్ల కొన్ని కుటుంబ కార్యక్రమాలకు నేను దూరం కావాల్సి రావడం చాలా నిస్పృహకు గురిచేసింది” అని రిచర్డ్ వాపోయాడు.
డాక్టర్ జావలి ప్రకారం కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు అధికం కావడానికి దారితీసే ఇతర అంశాలు:
- తగినన్ని నీళ్లు తాగకపోవడం: రోజూ తగినన్ని నీళ్లు తాగకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పుంది. వెచ్చని, పొడి వాతావరణంలో నివసించే వారు, చెమట ఎక్కువగా పట్టే వ్యక్తులలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉండొచ్చు.
- కొన్ని ఆహారాలు: ప్రోటీన్, సోడియం (ఉప్పు), చక్కెర అధికంగా ఉండే ఆహారం వల్ల కూడా కొన్ని రకాల రాళ్లు ఏర్పడే ముప్పుంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగల ఆహారంతో ముప్పు ఎక్కువ. ఆహారంలో ఉప్పు ఎక్కువైతే మూత్రపిండాలు వడగట్టాల్సిన కాల్షియం పరిమాణం పెరిగి, రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది.
- ఊబకాయం: అధిక శరీర ద్రవ్యరాశి సూచిక, భారీ నడుము–బరువు పెరగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు ఉంటుంది.
- జీర్ణకోశ వ్యాధులు-శస్త్రచికిత్స: గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, పేగు పుండు వ్యాధి లేదా దీర్ఘకాలిక విరేచనాలు జీర్ణ ప్రక్రియలో మార్పులకు దారితీస్తాయి. ఫలితంగా కాల్షియం, నీటిని పీల్చుకునే ప్రక్రియ ప్రభావితమై మూత్రంలో రాళ్లు ఏర్పడే పదార్థాల పరిమాణం పెరుగుతుంది. డాక్టర్ జావలి వివరించిన మేరకు: ‘రీనల్ ట్యూబ్యులర్ అసిడోసిస్’ (రక్తంలోని ఆమ్లాలను మూత్రంలోకి పంపడంలో మూత్రపిండాల వైఫల్యం, ఫలితంగా శరీరంలో ఆమ్లం పేరుకుపోవడానికి దారితీసే పరిస్థితులు), సిస్టినూరియా (అనువంశిక జీవక్రియ రుగ్మతల ఫలితంగా మూత్రంలో అమైనో యాసిడ్ స్ఫటికం ఏర్పడుతుంది) హైపర్‌పారాథైరాయిడిజం (పారాథైరాయిడ్ గ్రంథులు అధిక మొత్తంలో పారాథైరాయిడ్ హార్మోన్‌ను రక్తప్రవాహంలోకి పంపడం), మూత్ర మార్గం ఇన్ఫెక్షన్ పదేపదే రావడం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. “కొన్ని అనుబంధ పదార్థాలు (విటమిన్ సి, అనుబంధ ఆహారాలు వంటివి), కొన్ని మందులు- విరేచనకారులు (అధికంగా వాడితే), కాల్షియం ఆధారిత యాంటాసిడ్లు, మైగ్రేన్-మానసిక కుంగుబాటు చికిత్సకు వాడే మందులు వంటివి కూడా మూత్రపిండాల్లో రాళ్ల ముప్పును పెంచుతాయి” అని ఆయన వివరించారు.
- కాగా, శక్తివర్ధక పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్) ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు సరిగా తాగకపోవడం తన మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు దారితీసి ఉండవచ్చునని రిచర్డ్ అంటున్నాడు. “ఎనర్జీ డ్రింక్స్, కాఫీతోపాటు కొన్ని సాధారణ ఆహారాల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. డ్రింకులు ఎక్కువగా తీసుకోవడంతోపాటు విపరీత శ్రమవల్ల శరీరంలో నీటి శాతం తగ్గిన కారణంగానూ రాళ్లు ఏర్పడే పరిస్థితి ఉంటుంది.”
-
మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స
- రాయి పరిమాణాన్నిబట్టి చికిత్స విధానం నిర్ణయిస్తామని డాక్టర్ కుమార్ చెప్పారు. “సాధారణంగా 4 మి.మీ.కి తక్కువ పరిమాణంగల చిన్నరాళ్లు సహజంగా బయటకు వచ్చే అవకాశం 90 శాతం కాగా, 6 మి.మీ.కిపైగా ఉంటే 10 శాతమే”నని ఆయన చెప్పారు. “నొప్పి తగ్గించడానికి, మూత్ర నాళాల సడలటానికి ఇచ్చే మందులతో మూత్రనాళం దిగువ చివరనుంచి చిన్న రాయి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, వాటంతటవిగానీ, మందులతోగానీ బయటకు వెళ్లని రాళ్లుంటే శస్త్రచికిత్స ఒక మార్గం.” మూత్రపిండాల్లో చిన్నరాళ్లుంటే కోతపెట్టే చికిత్స అవసరం చాలావరకూ ఉండదని డాక్టర్ జావలి చెప్పారు. నీళ్లు ఎక్కువగా తాగడం, నొప్పి నివారణ మందులు తీసుకోవడం ద్వారా చిన్న రాయిని బయటకు పంపవచ్చునని ఆయన చెప్పారు. పెద్ద రాళ్లయితే అనేక చికిత్స పద్ధతులున్నాయని వివరించారు.
- రిచర్డ్ తొలిసారి 9 మి.మీ రాయిని తొలగించేందుకు లేజర్ లిథోట్రిప్సీ చికిత్స చేయించుకున్నాడు. అయితే, “మంట, వాపు కారణంగా తొలి ప్రయత్నం విఫలమైంది… వైద్యులు ఒక స్టెంట్ (మూత్రపిండం నుండి మూత్రాశయందాకా మూత్రం వెళ్లేలా మూత్ర నాళంలో ఒక చిన్న గొట్టం) పెట్టారు. మరోసారి ప్రయత్నించడం కోసం ఒక వారం తర్వాత నేను తిరిగి ఆస్పత్రికి వెళ్లాను” అని అతను చెప్పాడు. “రెండో ప్రయత్నం విజయవంతం కాగా, ఒక స్టెంట్ పెట్టారు. కాబట్టి రెండోసారి వైద్య చికిత్స అవసరం రాలేదు.. ఎందుకంటే– చాలా ఇబ్బందిపడినా రాళ్లు బయటకు వెళ్లడం సాధ్యమైంది” అని తెలిపాడు. ఇప్పుడు మరోసారి సమస్య రాగా, తాను మళ్లీ లిథోట్రిప్సీ లేదా అలాంటి ప్రక్రియ చేయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే ఒక వైద్య పరికరం శరీరంలో అమర్చడమే ఇందుకు కారణమని రిచర్డ్ చెప్పాడు.
- ఈ నేపథ్యంలో మూత్రపిండాల్లో రాళ్లను అరికట్టడానికి లాభాపేక్ష రహిత సంస్థ ‘అమెరికా జాతీయ కిడ్నీ ఫౌండేషన్’ కింది మార్గాలను సూచిస్తోంది:
- నీళ్లు బాగా తాగండి.. ముఖ్యంగా వ్యాయామం లేదా చెమట ఎక్కువ పట్టే కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు ఇదెంతో అవసరం.
- మీ ఆహారంలో సోడియం (ఉప్పు) అధికంగా ఉండే ఆహారాలను తగ్గించండి. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలతో కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలను కలిపి తీసుకోండి.
- మీ ఆహారంలో నిమ్మరసం కలిపిన నీటిని జోడించండి
- మందులు, ఆహార అలవాట్ల సర్దుబాటు విషయంలో నెఫ్రాలజిస్టులు, యూరినరీ స్పెషలిస్టుల సలహాలను తప్పక పాటించండి.