
కొత్తవి, తెలియనివి లేదా సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల కారణంగా ఎదురయ్యే ఒత్తిడి ఈ రోజుల్లో చాలా సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఇలా నిరంతరం ఎదురయ్యే ఒత్తిడి శారీరకంగా, మానసికంగా మరియు ప్రవర్తనాపరమైన లక్షణాలకు కూడా కారణం అవుతుంది. అందుకే ఈ సమస్యలను ప్రారంభంలోనే తుంచేసేందుకు, ఆందోళనను తగ్గించుకునేందుకు సంపూర్ణమైన విధానాలను పాటించాలంటూ నిపుణులు నొక్కి చెప్తున్నారు.
ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి
ఒత్తిడి మరియు ఆందోళన మధ్యతేడా తెలుసుకునేందుకు పరీక్ష రాయడాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. చాలామందిలో పరీక్షలు రాసే సమయానికి భయం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు మనం గమనించవచ్చు. కానీ ఇంకొందరిలో మాత్రం పరీక్షలు ప్రారంభం కాకముందే వాటి ఫలితం ఏమవుతుందో అని బాధపడిపోతూ ఉంటారు. అటువంటివారిలో మాత్రం ఈ ఒత్తిడి ఆందోళనగా మారుతుంది.
ఆందోళన అనేది జన్యుపరమైన కారణాలు మరియు బై పోలార్ డిజార్డర్ (bipolar disorder), బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (borderline personality disorder), క్యాన్సర్ (cancer), PTSD లేదా OCD వంటి అనారోగ్య పరిస్థితుల కారణంగా కలగచ్చని అంటున్నారు సుజా సుకుమారన్. బాల్యంలో వేధింపులకు గురైన బాధిత చిన్నారుల కోసం పనిచేసే బెంగళూరులో ఉన్న ఎన్‌ఫోల్డ్ ప్రోయాక్టివ్ హెల్త్ ట్రస్ట్‌కు ఆమె కౌన్సెలర్, జీవనైపుణ్యాల ట్రైనర్ మరియు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆందోళనను మరింత పెంచే కొన్ని అలవాట్లు
క్రమ పద్ధతి లేని నిద్ర
క్రమరాహిత్యమైన నిద్ర వల్ల ఆందోళన మరింత పెరుగుతుందని అంటారు సుకుమారన్. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా ప్రమాదకరమైనది కూడా. ఒక వ్యక్తి తనకు ఉన్న వివిధ బాధలు కారణంగా ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర లేమి సమస్యలకు గురవుతారు. అటువంటి వారు మర్నాడు చేసే పనులపై దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అలాగే ఇది ఒత్తిడిని కూడా మరింత పెంచుతుంది. ‘‘నిద్ర పట్టని కారణంగా ఆ వ్యక్తి ఇప్పుడు మరుసటి రాత్రి మరింత ఆలోచిస్తారు. ఫలితంగా ఆ రోజు కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మందులు లేదా చక్కని నిద్రకు ఉపకరించే ఏవైనా యాక్టివిటీస్ ద్వారా ఈ సైకిల్‌ని ఆపకపోతే ఇదే క్రమం రోజూ కొనసాగుతుంది’’ అంటారామె.
కావాలని ఉద్దీపనతో ఆవలింతను ఆపుకోవడం
చాలామంది మానసికంగా సంసిద్ధంగా ఉండేందుకు ఒక రోజులో చాలా కప్పుల కాఫీ తాగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా తీసుకునే కాఫీ ద్వారా మన శరీరంలోకి అధిక మొత్తంలో వచ్చి చేరే కెఫీన్ కూడా ఆందోళనను కలిగిస్తుందని అనేక మందికి తెలియదు. 1970ల నుంచి జరిపిన అనేక అధ్యయనాలను జర్నల్ ఆఫ్ సైకోఫార్మకాలజీలో డిసెంబర్, 2015లో గరేత్ రిచర్డ్స్ మరియు ఆండ్రూ స్మిత్‌లు సమీక్షించారు. దీని ద్వారా మానవుల ఆరోగ్యం మరియు తీసుకునే కెఫీన్‌ల మధ్య గల సంబంధాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో కెఫీన్ కొంత మొత్తం (400 మిగ్రా కంటే తక్కువ) వరకు అయితే మానసిక స్థితిని చక్కగా మెరుగుపరుస్తుందని గమనించారు. కోలా బేస్డ్ శీతల పానీయాలు మరియు ఎనర్జీ డ్రింక్స్ లోని కెఫీన్ కూడా ఇందులో భాగమే. కాబట్టి ఆందోళనకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి రోజులో ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ ఎప్పుడూ అవసరంలో ఉన్న మిత్రుడే. అలాగని నిద్రించే సమయానికి దగ్గర్లో మాత్రం దీనిని తాగకూడదు.
చురుకుదనం కోసం వ్యాయామం చేయడం
వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మనసుకి సంతోషం కలిగించడమే కాకుండా శరీరానికి సహజసిద్ధమైన పెయిన్‌కిల్లర్‌గా పని చేస్తాయి. అయితే వ్యాయామం చేయడానికి బదులుగా చాలామంది చాక్లెట్ తినడం, కెఫీన్, మద్యం, పొగాకు లేదా ఇతరత్రా సత్వర పరిష్కారాలతో ఒత్తిడిని ఎదుర్కొనే దారులను ఎందుకు ఎంపిక చేసుకుంటారో ఎప్పుడైనా మీరు ఆలోచించారా?? శ్రమతో కూడుకున్న వర్కౌట్ సెషన్‌లో భాగం అవ్వడం కన్నా ఒక సిప్ మద్యం లేదా కాఫీ తాగడం, సిగరెట్ పఫ్ తీసుకోవడం చాలా సులభం. అలాగని వ్యాయామం అనగానే అదేదో రోజూ పరిగెత్తే మారథాన్ అనో లేక జిమ్‌లో బరువులు ఎత్తడమూ అనుకోకండి. పార్క్‌లో రోజూ ఉదయాన్నే చేసే మార్నింగ్ వాక్, రోజంతా అలసిపోయేలా పని చేసిన తర్వాత ఆడే బ్యాడ్మింటన్ కూడా వ్యాయామం చేసినట్లే అవుతుంది. ఆందోళనతో సతమతమయ్యేవారికి వయసు, చురుకుదనం మరియు సమయం ఆధారంగా కొన్ని రకాల శారీరక శ్రమ కలిగించే పనులు చేయాలని సూచిస్తారు. ఇవి నిష్క్రియ శరీరం యొక్క ప్రభావం మెదడు పై పడకుండా చేస్తాయి.
ఫలితాలను నియంత్రించాలని ప్రయత్నించడం..
ఎవరైతే తమ జీవితంలో వచ్చే ప్రతి ఫలితాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తారో వారు అధిక సమయం బాధపడుతూనే గడుపుతుంటారు. అలాగే జీవితంలో ప్రతిదీ మన నియంత్రణలో ఉండదు అనే వాస్తవాన్ని అంగీకరించగలిగినవారు కాస్త తక్కువగానే బాధ పడతారు. బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఉమేష్ కుమార్ కోల్‌కతాకు వెళ్లిపోయారు. అక్కడ ఆయనకు తెలిసినవారు లేరు కాబట్టి తన జీవితంలో తలెత్తే తదుపరి పరిణామాల గురించి ఆయనకు అంతగా తెలీదు. ఆయన నేర్చుకున్న జీవిత పాఠాలను అందరితోనూ పంచుకుంటూ 72 ఏళ్ల ఆ వృద్ధ వ్యాపారి ‘‘జీవితంలో నేను ఎన్నో ఆటుపోట్లను చూశాను. అంతమాత్రాన ఏనాడూ నేను కుంగిపోలేదు. ఎందుకంటే జీవితంలో ఏదీ మన చేతుల్లో ఉండదు.. మనం చేసే పనులు తప్ప..’’. ముఖ్యంగా మనం చేసిన పనుల ఫలితాల గురించి అంతగా పట్టించుకోకూడదు. ‘‘మీరు అనుకున్నట్లుగానే జరగడం కోసం మీ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఫార్ములా ఉందా?? ఒక్కోసారి బాగా రాణించిన చెస్ క్రీడాకారులు సైతం ఓడిపోతూ ఉంటారు’’ అంటారామె.
అధికంగా వార్తలు తెలుసుకోవడం..
ఆందోళన తగ్గించుకునేందుకు సుకుమారన్ వద్దకు వచ్చే చాలామంది న్యూస్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారే కావడం విశేషం. ‘‘అప్డేటెడ్‌గా ఉండడం అనేది చాలా మంచి విషయమే. అయితే మితిమీరిన వార్తలు తీసుకోవడం మరియు కొన్ని కార్యక్రమాల ద్వారా నివేదించబడిన భయంకరమైన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల కూడా ఆందోళన మరింత పెరుగుతుంది. అలాగే ఇంకొందరిలో దడ సమస్యను సైతం మనం చూడవచ్చు.
కోవిడ్ (COVID-19) మహమ్మారి ప్రారంభమైన మొదటి సంవత్సరంలో ఆందోళన మరియు డిప్రెషన్‌కు గురైన వారి సంఖ్య దాదాపు 25% పెరిగిందని, మార్చి 2022లో విడుదలైన ఒక సైంటిఫిక్ సంక్షిప్త కథనంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకటించింది. కోవిడ్ ఎక్కడ సంక్రమిస్తుందో అనే భయం కూడా ఈ మానసిక సమస్యలకు ప్రధాన కారణం అయింది. ‘‘2020లో అది తప్ప మరే వార్తలు మనం చూడలేదు. మనమంతా ఇంట్లోనే ఉంటూ పూర్తిగా ఇంటిని మూసేసి ఉంచాం. ఆ వైరస్ గాలి ద్వారా ప్రయాణిస్తుందని తెలియగానే కనీసం కిటికీ తలుపులు కూడా తీయలేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ ఇన్ఫెక్షన్‌కు ఎక్కడ గురవుతారో, మిగతావారికి అది ఎక్కడ సంక్రమిస్తుందోనని ఆందోళన పడుతూనే ఉన్నారు. దాని పరిణామాల గురించి ఆలోచిస్తేనే నాకు దడ పుడుతుంది’’ అంటారు సంధ్యా దత్త (76). ఆమె ఒక గృహిణి. తన భర్త, కొడుకు మరియు కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలో నివసిస్తున్నారు.
ఆందోళనను మరింత పెంచే ఇతర అలవాట్లు మరియు పద్ధతులు:
జీవితం పట్ల ప్రతికూల ధోరణి – జీవితంలో సంబంధాలు, రిస్క్‌తో కూడుకున్న ఆర్థిక నిర్ణయాలు లేదా కొత్త ఆలోచనలు.. ఇలా ఏవైనా సరే.. అవి ఖచ్చితంగా తప్పుగానే అవుతాయని భావించేవారు జీవితం పట్ల ప్రతికూల ధోరణి కలిగి ఉంటారు.
సోషల్ మీడియాను పరిమితికి మించి ఉపయోగించడం – ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా ఆధారంగానే సమాచారం సరైనదో, కాదో ధృవీకరించుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే తమ జీవితాలను ఇతరుల జీవితాలతో పోల్చుకుంటారో వారు ఆ ప్రవర్తనాతీరు ఫలితంగా తరచూ అసహనానికి గురికావడం, వారి జీవితాల పట్ల వారే అసంతృప్తి వ్యక్తపరచడం వంటివి చేస్తున్నారు.
పని-జీవితం మధ్య అసమతుల్యత – పని చేసేటప్పుడు కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేకపోతున్నామని బాధపడడం.. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు రేపు చేయాల్సిన పని గురించి ఆలోచిస్తూ సమయం గడపడం వల్ల బాధపడుతూనే ఉంటారు. అలాగే వారు ఎప్పుడూ అలసిపోయినట్లు లేదా కోపంగానూ ఉండచ్చు.
తగాదాలకు దూరంగా ఉండండి – కొంతమంది ఎంత ఎక్కువ మందితో మాట్లాడినా ఎవరితోనూ తగాదాలు రాకుండా బ్యాలెన్స్డ్‌గా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి ఇమేజ్ పట్ల వారికి ఉన్న ఆలోచన వల్ల కావచ్చు లేదా వారి మనస్తత్వం కావచ్చు. తగాదాలు ఎక్కువ అయ్యే కొద్దీ అనవసరమైన బాధతో పాటూ వారిని ఇతరులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం కూడా పెరుగుతుంది.
వాస్తవానికి దూరంగా ఉండే లక్ష్యాలు – ఇవి అకడమిక్, ప్రొఫెషనల్, ఆర్థికం, సోషల్ లేదా వ్యక్తిగతమైన లక్ష్యాలు కూడా కావచ్చు. వీటి ఫలితంగా ఎవరికి వారే ఒత్తిడిని కొని తెచ్చుకుంటున్నట్లు అవుతుంది. దానిని అలాగే వదిలేస్తే అది దీర్ఘకాలపు సమస్య కూడా అవుతుంది.