సహచరుల ఒత్తిడి సాధారణంగా ప్రతికూల అంశంగా పరిగణించబడుతూంటుంది. వాస్తవానికి దాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించే మార్గముంది.
సామాజిక మాధ్యమాల్లో మనం తరచూ ‘సర్దుకుపోవడం’ లేదా సహచరుల ఒత్తిడిని ప్రతికూలాంశంగా పరిగణించే కథనాలను చూస్తుంటాం. అయితే, ఈ అంశాన్ని మరో కోణంలోనూ చూడవచ్చునన్నది ఆశ్చర్యకమైన వాస్తవం. నిపుణులు దీన్ని ‘సానుకూల సహచర ఒత్తిడి’గా పేర్కొంటారు. ఈ సానుకూల సహచర ఒత్తిడి ద్వారా సహచర ఒత్తిడిని మీకు అనుకూలం చేసుకోవడం ఎలాగో ‘హ్యాపీయెస్ట్ హెల్త్’ వివరిస్తుంది.
సానుకూల సహచర ఒత్తిడి అంటే– ఏదైనా నిర్మాణాత్మకంగా చేయమని సహచరులు మనల్ని ప్రోత్సహించడం లేదా సానుకూల దృక్పథంతో ఎదగడానికి ఉత్తేజమివ్వడం.
“సహచరుల ఒత్తిడి అన్నివేళలా ప్రతికూలం కాదన్న వాస్తవాన్ని మనం మొదట గ్రహించాలి. పిల్లలు బాగా చదువుకునేలా తోటివారు ప్రోత్సహించడం లేదా కుంగుబాటుకు గురైనప్పుడు మానసిక ఉపశమన మద్దతివ్వడం వంటి సానుకూల సహచర ఒత్తిడి కూడా ఒకటుంది. పిల్లలను చెడు అలవాట్ల వైపు నడిపించే సహచర ఒత్తిడిని మాత్రమే మనం నివారించాలి” అని బెంగళూరులోని బంజారా అకాడమీ కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలర్, కాలమిస్ట్, జీవన నైపుణ్య శిక్షకుడైన డాక్టర్ అలీ ఖ్వాజా చెప్పారు.
స్నేహాన్ని కొనసాగిస్తూనే హేతుబద్ధత, సాలోచనతో కూడిన కారణాలను వివరించడం ద్వారా సహచర ఒత్తిడి నివారణకు ఆయన కొన్ని సులువైన పద్ధతులను సూచించారు. ఉదాహరణకు॥ స్నేహితులు సిగరెట్ కాల్చమని బలవంతం చేసినపుడు– తాను క్రీడా పోటీల్లో పాల్గొనేవాడినని, ధూమపానం తన శక్తిసామర్థ్య స్థాయిని తగ్గిస్తుందని చెప్పాలి.
సహచరుల నుంచి వచ్చే సానుకూల ఒత్తిడిని తీసుకునేలా ప్రోత్సహించండి
సహచర ఒత్తిడివల్ల టీనేజర్లలో సానుకూల ప్రభావం ఉంటుందనడం వాస్తవమని గుర్గావ్‌లోని డబ్ల్యు ప్రతీక్షా హాస్పిటల్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ మునియా భట్టాచార్య అన్నారు. తన తరగతి మిత్రులు మంచి గ్రేడ్‌లు తెచ్చుకోవడం చూసి ఉత్తేజితుడైన ఒక విద్యార్థి పట్టుదలతో వారిని అధిగమించడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. దీన్నే సానుకూల సహచర ఒత్తిడిగా పరిగణించవచ్చునని చెప్పారు.
ప్రతికూల సహచర ఒత్తిడిపై తల్లిదండ్రులు పిల్లలను మందలించడం కన్నా సహచరుల బృందంలో పాటించదగిన సానుకూల స్థితిపై వారికి చిట్కాలు ఇవ్వడం మంచిదంటారు.
నిషేధించేందుకు బదులు ప్రోత్సాహమివ్వండి
మద్యపానం లేదా ధూమపానం వంటి వ్యసనపూరిత ప్రవర్తనపై తల్లిదండ్రులుగా మనం కఠినంగా వ్యవహరించడం సబబేనని భట్టాచార్య చెప్పారు. కానీ, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, పాఠశాలపై వ్యతిరేక ధోరణి ప్రదర్శించడం లేదా గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడటం వంటి ఇతరత్రా విషయాల్లో తాము ఆమోదించని వాటిపై తల్లిదండ్రులు నిషేధాలు విధించడం కాకుండా సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు.
సానుకూల సహచర ఒత్తిడికి దోహదం చేసే ఒక బృందం ఉంటే– చెడు అలవాట్లు మానుకుని వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును ఉజ్వలం చేయగల ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకునే వీలుంటుందని మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లోగల ఓజాస్ గ్లోబల్ స్కూల్‌లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, కౌన్సెలర్ అయిన శ్వేతా నేమా చెబుతున్నారు. సానుకూల సహచర ఒత్తిడితో ప్రయోజనం పొందే మార్గాలను ఆమె ఇలా సూచించారు:
- మీ పిల్లలు అనుసరించే విలువలేమిటి… వాటినెలా ప్రదర్శిస్తారు? అనే అంశంపై వారితో మాట్లాడండి. అలాంటి విలువలున్న వారితో స్నేహం చేసేలా వారిని ప్రోత్సహించండి.
- ఆదర్శప్రాయులైన వ్యక్తులు శక్తిమంతమైన సహచర ఒత్తిడిని లేదా ఆ ప్రభావాన్ని పిల్లలపై చూపగలరు. తనకు ఆదర్శప్రాయులెవరో, వారిలో అనుసరించదగిన లక్షణాలేమిటో గుర్తించాల్సిందిగా మీ బిడ్డను ప్రోత్సహించండి. వారికి ఉత్తేజమివ్వగల ఆదర్శప్రాయులను ఎంచుకోవడంలో మద్దతివ్వండి.
సానుకూల సహచర ఒత్తిడిని ప్రోత్సహించే చిట్కాలివే
“కరోనా దిగ్బంధం తర్వాత పాఠశాల తిరిగి తెరిచినపుడు ఒక ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల మానసిక స్థితిని విద్యాపరంగా, భావోద్వేగపరంగా గాడిన పెట్టడంలో మేం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం” అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ న్యూటౌన్ అకడమిక్ కోఆర్డినేటర్ (సీనియర్ స్కూల్) మధురిమ ఆచార్య చెప్పారు. “పిల్లలు సహజంగా సహచరులను చూసి ప్రభావితమవుతారు కాబట్టి, దాన్ని సానుకూల రీతిలో ఉపయోగించాలని మేం భావించాం. ఆ కృషి సత్ఫలితాలిచ్చింది” అని ఆమె వివరించారు. సానుకూల సహచర ఒత్తిడిని పెంచేందుకు ఆమె సూచించిన కొన్ని మార్గాలివే:
అధ్యయనం బృందం ఏర్పాటు
మా పాఠశాలలో పిల్లలంతా కలసి కూర్చుని బోధన, అభ్యాసం చేసేందుకు ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేశాం. ఇది పిల్లలకు రెండు విధాలుగా సహాయపడుతుంది. మొదటిది… స్నేహితులు తమకేదైనా నేర్పినపుడు వారు సులభంగా అర్థం చేసుకోగలరు. రెండోది… వారు చదువులో రాణించడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
కార్యక్రమాలు నిర్వహించండి
మేము సైన్స్ క్విజ్, జీకే క్విజ్‌ల వంటి కొన్ని విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇలాంటి వాటిలో పాల్గొనడానికి కొందరు పిల్లలు ఇష్టపడరు. కానీ, వారు తమ మిత్రులకు తోడుగా వస్తారు. తద్వారా వారు కూడా ఆస్వాదించడం మొదలుపెడతారు.
సానుకూల సహచర ఒత్తిడి ప్రయోగించేలా విద్యార్థులను ప్రోత్సహించండి
మన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని మేము విద్యార్థులకు బోధిస్తాం. ఆత్మవిశ్వాసంతో, సముచిత నిర్ణయంతో వ్యవహరించడం ద్వారా ఇతరులు వారిని గౌరవించడానికి, వారి నాయకత్వాన్ని అంగీకరించడానికి మరింత మొగ్గు చూపుతారు.
కొత్తగా ఏదైనా చేయడం
కొందరు పిల్లలు కాలిగ్రఫీ, పాటలు పాడటం, నృత్యం చేయడం వంటి కొత్త ప్రయత్నాలు చేయడానికి బెరుకు చూపుతారు. కానీ, తమ స్నేహితులు కూడా తోడుగా ఉంటే ఆయా తరగతులలో చురుగ్గా పాల్గొంటారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆహ్లాదకర వాతావరణంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి తోడ్పడుతుంది.