ప్రతీకాత్మక చిత్రం | సచిత్ర వివరణ : శ్యాలిమా ఎం.దాస్‌చలికాలం కోసం సిద్ధంకండి – చర్మాన్ని తేమగా ఉంచుకోండి.. తలకు నూనె రాయండి.
చలికాలం వస్తూవస్తూ రకరకాల చర్మ సమస్యలను కూడా వెంట తెస్తుంది. చర్మం ఎండిపోవడం, మాడు పొడిబారడం, పెదవులు పగలడం, ముఖంపై మొటిమలు, వెంట్రుకలు చిట్లడం, జుట్టు పొడిబారడం/రాలిపోవడం, తలలో చుండ్రు, మడమలకు పగుళ్లు వంటి అనేక సమస్యలు ఈ కాలంలో ఎక్కువవుతాయి. కాబట్టి, చలికాలంలో కొన్ని నెలలపాటు చర్మ సంరక్షణ పద్ధతులు మార్చుకుందామని భావిస్తున్నారా? అయితే, మీకు సలహాలివ్వడానికి ఆయుర్వేద నిపుణులు సిద్ధంగా ఉన్నారు.
“ఈ చర్మ సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపకపోతే దీర్ఘకాలంలో అవి చర్మం పొడిబారడానికి సంబంధించిన “గజ్జి, బొల్లి, శీతాకాలపు దద్దుర్లు” (కోల్డ్ ఉర్టికేరియా) వంటి వ్యాధులకు దారితీస్తాయి” అని బెంగళూరులోని నిర్వాణ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ అధిపతి, కన్సల్టింగ్ ఫిజీషియన్ డాక్టర్ మేఘా నాయక్ చెప్పారు.
ఆయుర్వేదంతో ముందస్తు జాగ్రత్తలు
చికిత్సకన్నా అనారోగ్య నివారణే ఉత్తమమని ఆయుర్వేద వైద్య విధానం చెబుతుంది.
చలికాలంలో చర్మం, కురుల ఆరోగ్య సంరక్షణకు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలివే:
సాధారణ సూచనలు:-
- శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం (చలిని ఆపే దుస్తులు)
- వ్యాయామం చేయడం (శరీర పరిమితులకు మించకుండా)
- క్రమశిక్షణతో కూడిన జీవనశైలి (రోజువారీ ఆయుర్వేద పద్ధతి లేదా దినచర్య)
- సరైన/ఆరోగ్యకర ఆహారం
- శ్వాస వ్యాయామాలు
- చల్లటి… పొడిగాలిలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడటం
చర్మ సంరక్షణ పద్ధతులివే
తగినంత నీరు తాగడం
“చలికాలంలో తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. శరీరాన్ని తేమగా ఉంచడం ద్వారా నీరు తక్కువై శరీరం పొడిబారే సమస్య తప్పుతుంది” అని డాక్టర్ నాయక్ గారు జాగ్రత్తలు సూచించారు, చర్మం పొడిబారడానికి దారితీసే కారణాల్లో శరీరంలో తగినంత తేమ లేకపోవడం ఒకటి. అయితే, రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో డాక్టర్ నాయక్ చెప్పకపోయినా, తమ శరీర స్థితికి తగినట్లు ఎవరికివారు పరిమాణం నిర్ణయించుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
తేమగా ఉంచుకోవడం
“కాలానుగుణ పొడిదనం లేదా చర్మ పరిస్థితులను నివారించడానికి చర్మాన్ని తేమగా ఉంచుకోవడమే మంచి మార్గం” అని మైసూరులోని వ్యోమా ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ నూర్ ఫాతిమా చెబుతున్నారు. చలికాలంలో చర్మాన్ని… ముఖ్యంగా తరచూ పొడిబారే ముఖం, చేతులను తేమగా ఉంచడం కోసం ‘శతధౌత ఘృతం’ అనే ఔషధ నెయ్యి వాడాల్సిందిగా ఆమె సిఫారసు చేస్తున్నారు.
అయితే, శరీర తత్వానికి తగిన పైపూత పదార్థాలను డాక్టర్ నాయక్ సూచిస్తున్నారు:
- చర్మం ఎక్కువగా పొడిబారే వారికి నెయ్యి-వెన్న ఆధారిత పూత పదార్థాలు
- మొటిమలకు గురయ్యే సున్నిత చర్మానికి కొబ్బరి నీరు లేదా కలబంద (అలోవెరా) ఆధారిత పూత పదార్థాలు
- జిడ్డు చర్మానికి నువ్వుల నూనె లేదా మొక్కజొన్న నూనె ఆధారిత పూత పదార్థాలు
ముఖ మర్దనం ప్రయత్నించండి
చలికాలంలో నూనెతో శరీర మర్దనం ఒక ముఖ్యమైన పద్ధతిగా ఆయుర్వేదం సూచిస్తుంది. దీని ప్రకారం– ముఖం, చేతులు, పాదాలకు నూనె రాసుకుని, సున్నితంగా మర్దన చేయడం ద్వారా చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. అలాగే వారానికి ఒకటి లేదా రెండుసార్లు స్నానానికి ముందు శరీరమంతా నూనె రాసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.
ఇతర మర్దన పదార్థాలు
- బాదం నూనె
- మామూలు నెయ్యి లేదా (ఉప్పులేని) వెన్న
- కొబ్బరి నూనె పసుపు మిశ్రమం
వీటితోపాటు పాల మీగడ (మలాయ్)తో ఓ చిటికెడు పసుపు కలిపి పూసుకుని, సున్నితంగా మర్దన చేసుకోవచ్చు.
మెరుగైన ఫలితాలకు ముఖ లేపనం
చర్మంలో తేమ పెరిగి, పొడిబారడం తగ్గాలంటే తాజా పండ్లు వాడటం శ్రేష్టమంటున్న డాక్టర్ నాయక్ - ఇందుకోసం కొన్ని మిశ్రమాలను సూచిస్తున్నారు:
- బొప్పాయి గుజ్జు + తేనె
- అరటిపండు గుజ్జు + పాలు
- కీరదోస లేపనం
- అవకాడో గుజ్జు లేపనం
- కలబంద (అలోవెరా) గుజ్జు లేపనం
- చందనం + తేనె + రోజ్ వాటర్ + మేక పాలు
శుభ్రత – తేమను పెంచే పదార్థాలను వాడండి
శరీర తత్వాన్ని బట్టి శుభ్రత, తేమను పెంచే (క్లెన్సర్–టోనర్) పదార్థాలు ఎంచుకోవడం కూడా ముఖ్యమని డాక్టర్ నాయక్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా రోజ్ వాటర్‌ను టోనర్‌గా వాడుకోవాలని ఆమె సూచిస్తున్నారు. ఏ కాలంలోనైనా, ఏ తరహా చర్మానికైనా ఇది సరిపోతుందని చెబుతున్నారు.
ఆహారంపై సూచనలు
- సలాడ్లు, పండ్ల రసాల్లో క్యారట్, బీట్‌రూట్‌లను చేర్చుకోవాలి
- నెయ్యి వంటి ఆరోగ్యకర ఆహార కొవ్వులతోపాటు అవకాడో, చేపలు, గింజలు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కురుల సంరక్షణకు కొన్ని చిట్కాలు
మాడు… జుట్టు కురుల పరిశుభ్రత
తలపై చర్మం, జుట్టుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడంలో మాడు, జుట్టు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఉంది. శుభ్రమైన దువ్వెన వాడటం, జుట్టుకు రంగు, కఠిన రసాయనాలు, అధిక ఉష్ణోగ్రత వెలువరించే పరికరాలతో కేశాలంకరణ వగైరాలకు దూరంగా ఉండటం ముఖ్యమని ఆమె వివరించారు.
తలకు నూనె రాసుకోవడం… మర్దన చేయడం
తలకు క్రమం తప్పకుండా నూనె రాసుకోవడం, మాడుకు మర్దన చేయడంవల్ల చర్మం పొడిబారడం తగ్గుతుందని డాక్టర్ ఫాతిమా సూచిస్తున్నారు. ఆవిరి పట్టడంలో భాగంగా వెచ్చని టవల్‌ను తలకు చుట్టుకోవాలని కూడా చెబుతున్నారు. ఇలా చేస్తే మాడు తేమను పట్టి ఉంచుకోవడమే కాకుండా వెంట్రుకలకు పోషణ అందుతుంది.
తలనూనెల ఎంపికలో జాగ్రత్త వహించండి
తలకు రాసుకునే ప్రాథమిక తైలాలుగా కొబ్బరి, నువ్వులు, ఆముదం, బాదం వంటి నూనెలను ఎంచుకోవచ్చు. ఇవి మాడుతోపాటు జుట్టుకు పోషణనివ్వగలవు.
వెంట్రుకలకు రసాయనాల్లేని కండిషనర్లు వాడండి
తలకు సహజ కండిషనర్లు వాడాల్సిందిగా డాక్టర్ నాయక్ సూచిస్తున్నారు. “కోడి గుడ్డుతో మీకెలాంటి ఇబ్బందీ లేకపోతే వాటిని కండిషనర్‌గా వాడుకోండి” అని ఆమె సలహా ఇస్తున్నారు.
చుండ్రు.. జుట్టు రాలడం నివారణకు లేపన సమ్మేళనాలు
- చుండ్రు,వెంట్రుకలు రాలుటను నియంత్రించుటకు వేప పొడి + మెంతి గింజల పొడి
- చుండ్రు నివారణకు త్రిఫల పొడి + నీరు
- శీకాయ పొడి
- పెరుగు
అదనపు జాగ్రత్తలు
పైన చెప్పిన వాటితోపాటు క్రమం తప్పకుండా ‘ఫేషియల్, ఆయిల్ మసాజ్, హెయిర్ ఎన్‌రిచ్‌మెంట్ థెరపీ, మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవడమే కాకుండా ఆహార పద్ధతులు పాటించాలి” అని డాక్టర్ నాయక్ చెబుతున్నారు.
ఈ చిట్కాల తో ఉపశమనం లేకపోతే మీ డాక్టర్‌ను సంప్రదించండి
ఈ చిట్కాలతో ఉపశమనం కనిపించని పక్షంలో చర్మవ్యాధి నిపుణుల వద్దకు వెళ్లాల్సిందిగా డాక్టర్ ఫాతిమా స్పష్టం చేస్తున్నారు. “మీ వైద్యులు సమస్యకు మూలమేమిటో కచ్చితంగా అంచనా వేసి, దానికి తగినట్లు చికిత్స చేస్తారు. తద్వారా మీ చర్య ఆరోగ్యం కుదుటబడుతుంది” అని సలహా ఇస్తున్నారు.
సాధారణంగా చర్మం, జుట్టు ఆరోగ్యం విషయంలో ఆయుర్వేదం సమగ్ర పరిష్కారాలు చూపుతుంది. కేవలం పైపూతలు, లేపనాలతో ఈ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం దొరకదు. వీటికితోడు ఆరోగ్యకర ఆహారం, సాధారణ వ్యాయామాలు, నిలకడైన మానసిక స్థితి, చక్కని నిద్రసహా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మొత్తంగా చర్మం, జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మీ చర్మం, జుట్టు సంరక్షణకు సంబంధించి మీకంటూ ప్రత్యేక పద్ధతుల కోసం ఆయుర్వేద నిపుణుల వద్దకు వెళ్లడం అత్యుత్తమం.