
కొరియన్ సినిమాలు, సంగీతం మన జీవితాలపై గణీనీయమైన ప్రభావం చూపుతున్న తరుణంలో అద్భుతమైన కొరియన్ గ్లాసీ చర్మ సౌందర్యం గురించి, దాన్ని సాధించడానికి అవలంభించాల్సిన విధానాల గురించి ప్రపంచం ఆసక్తిని కనబరుస్తోంది.
ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘కే వేవ్’
సంగీతం, సినిమాలు, యానిమేషన్ దగ్గర్నుంచి కాస్మటిక్స్, హెయిర్ స్టయిల్స్, ఫ్యాషన్ దాకా చాలా విషయాల్లో కొరియన్ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా బలమైన అభిమానుల బేస్ ఏర్పడింది. కొరియన్లలు ప్రదర్శిస్తున్న నిష్కళంకమైన చర్మ సౌందర్యం ప్రసిద్ధి చెందిన వారి చర్మ ఆరోగ్య సంప్రదాయాలు ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చర్మ సౌందర్యాన్ని కాపాడుకునే కొరియన్ల విధానాల పట్ల చాలా కాలం నుంచే ఆదరణ ఉంది. అద్దంలాంటి మెరిసే చర్మాన్ని పొంది, దాన్ని కాపాడుకునే విధానాలు ప్రస్తుతం రహస్యం ఏమీ కాదు.
కొరియన్ల చర్మ సంరక్షణ విధానాల గురించి, కీలకమైన అంశాల గురించి కొందరు నిపుణుల్ని అడిగి తెలుసుకున్నాం.
బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆక్షీ బన్సాల్ కొరియన్ చర్మ సంరక్షణ విధానం అంటూ చాలా విస్తృతమైన అర్థం ఉందని చెప్పారు. ‘‘కొరియన్ చర్మ సంరక్షణ విధానం అని చెప్పినప్పుడు అది కాస్మెక్యూటికల్స్(ఔషధాలతో తయారైన సౌందర్య సాధనాలు) ఉత్పత్తులు కొరియన్ మార్కెట్లో బాగా ప్రజాధరణ పొందాయి. ఈ మధ్య కాలంలో రకరకాల ఉత్పత్తులు జనాదరణ పొందాయి. వాటన్నిటినీ కలిపి ఒక మాటలో చెప్పడానికి జనం దీన్ని ఉపయోగిస్తున్నారు.’’
మచ్చలు లేని, తేమతో కూడిన, బిగువైన చర్మాన్ని సాధించడమే కొరియన్ విధానాల ప్రధాన లక్ష్యం.
చర్మ సంరక్షణ నిపుణులు టెన్ స్టెప్, ఫైవ్ స్టెప్, త్రీ స్టెప్ విధానాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా టెన్ స్టెప్ విధానం అనేది కొరియన్ చర్మ సంరక్షణ విధానంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
డాక్టర్ బన్సాల్ టెన్ స్టెప్ దిన చర్య గురించి ఈ విధంగా చెప్పారు:
- ప్రి-క్లెన్సర్: ఈ స్టెప్ లో చమురు ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి కాలుష్యకారకాలు, దుమ్ము లేదా మేకప్ లాంటి జిడ్డు మలినాల్ని తొలగిస్తారు.
- ఫోమ్ బేస్డ్ లేదా వాటర్ బేస్డ్ క్లెన్సర్: ముఖం మీద ఉండే నీటిలో కరిగే మలినాల్ని తొలగించడానికి వాడతారు.
- మృత చర్మ కణాల తొలగింపు: చర్మం మీద పేరుకున్న మృత కణాల్ని తొలగించాలి. అందుకు భౌతికమైన ప్రక్రియల్ని కాకుండా మృత కణాల్ని తొలగించే రసాయనాల్ని వాడాలి. అందుకోసం AHA అని పిలవబడే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్; BHA లేదా బీటా హైడ్రాక్సి యాసిడ్; PHAపాలీ హైడ్రాక్సీ యాసిడ్ లను ఉపయోగిస్తారు. చర్మం స్వభావం, సౌకర్యాన్ని బట్టీ ఈ ప్రక్రియని ప్రతి రోజూగా గానీ, వారానికి రెండుసార్లు గానీ అనుసరించాలి.
- టోనర్ తిరిగొచ్చింది: చర్మం పీహెచ్ సమతుల్యాన్ని పునుద్ధరించడానికి ఒకప్పుడు టోనర్ వాడకం చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగంగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో సబ్బులు, క్లెన్సర్లు క్షార స్వభావంతో ఉండేవి. అయితే ఫేస్ వాష్ లు, తేలికపాటి సబ్బుల రాకతో టోనర్ల వినియోగాన్ని ఆపేశారు. డెర్మటాలజిస్ట్ లు కూడా వాటిని సూచించడం లేదు. అయితే ఆమ్ల స్వభావం ఉన్న సబ్బులు, కఠిన జలాల్ని భర్తీ చెయ్యడానికి ఈ మధ్య టోనర్ల అవసరం మళ్ళీ పెరుగుతోంది. కొరియన్ విధానాల్లో ఉపయోగించే హైడ్రేటింగ్ టోనర్లు ఆమ్ల సమతౌల్యాన్ని పునరుద్ధరించడానికి మించి చాలా చేస్తాయి.
- ఎసెన్స్ వినియోగం: మచ్చలు లేని చర్మం కోసం, చర్మంలో తేమ కోసం సరైన ఎసెన్స్ని రాసుకోవాలి. అది చర్మం యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఎసెన్స్లు తర్వాత రాసుకునే వాటి కోసం కూడా చర్మాన్ని సిద్ధం చేస్తాయి.
- యాక్టివ్స్: ఒక వ్యక్తికి ఉన్న సమస్య ఆధారంగా వీటిని ఉపయోగిస్తారు. శాలిసిలిక్ యాసిడ్ తో తయారైన యాక్టివ్స్ మొటిమల నివారణకు ఉపయోగపడుతుంది. జింక్ తో ఉన్న యాక్టివ్స్ రోమకూపాల మీద పని చేస్తాయి. అలాగే నియాసినమైడ్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
- షీట్ మాస్క్: ఇది వేగంగా 20 నిమిషాల్లోనే చర్మానికి తేమతో కూడిన ఉత్తేజాన్నిస్తుంది.
- ఐ క్రీమ్: కంటి చుట్టూ ఉండే చర్మం సున్నితమైంది. పలచగా ఉండి త్వరగా పొడిబారుతుంది. ముఖంలోని మిగతా చర్మం కంటే అది భిన్నంగా ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకమైన యాక్టివ్ అవసరం.
- మాయిశ్చరైజర్: చర్మంలో తేమ స్థాయిలను నిర్వహించుకోవడానికి, చర్మం సామర్థ్యానికి బలం ఇవ్వడానికి ఈ స్టెప్ చాలా కీలకమైంది.
- సన్ స్క్రీన్: కొరియన్ చర్మ సంరక్షణ విధానంలో ఇది చాలా ముఖ్యమైన స్టెప్. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ పొందే విధానం ఇది. ఆ కిరణాలు చర్మం మీద పడితే త్వరగా వయసైపోతుందని నమ్ముతారు.
రోజువారీ ఇంత శ్రమతో కూడిన విధానాలు అవసరమా?
ఈ రోజువారీ విధానాల్ని ఉదయం అలాగే సాయంత్రం పాటించాలని కొరియన్ చర్మ సంరక్షణను ప్రోత్సహించే వారు చెబుతున్నారు.
ఈ ప్రక్రియ చర్మాన్ని మంచి తేమతో ఉంచుతుందనడంలో సందేహం లేదని న్యూ ఢిల్లీలో సౌల్ డెర్మా క్లినిక్ వ్యవస్థాపకురాలు, డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ అనైకా గోయెల్ చెబుతున్నారు. అయితే మొత్తం పది స్టెప్స్ ని అనుసరించడానికి చాలా సమయం పడుతుంది. అది నిర్వహణీయం కాదు. అలాగే భారతీయుల చర్మానికి అవన్నీ అవసరం లేదని ఆమె చెప్పారు.
‘‘వాటికి బదులు ఒక బేసిక్ క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందొచ్చు’’ అని ఆమె చెప్పారు. చర్మం మామూలుగా ఉన్నా లేక పొడిగా ఉన్న ఈ మూడు స్టెప్ ల విధానం చాలా సూటవుతుంది. అలాగే మొటిమలు వచ్చే చర్మానికి ఇలాంటివి ఎంత తక్కువ వాడితే అంత మంచిదని ఆమె అభిప్రాయం.
10-స్టెప్ చర్మ సంరక్షణ విధానాలతో స్పష్టమైన ప్రయోజనాలు కనిపిస్తాయి, కానీ వాటిని అనుసరించడం ఆచరణీయం కాదని డాక్టర్ బన్సాల్ చెప్పారు. ‘‘చర్మ సంరక్షణ విధానం ఎక్కువ మందికి అందుబాటు ధరల్లో, ఆచరణాత్మకంగా ఉండాలి(ఎందుకంటే దానిలో చాలా ఉత్పత్తులను ఉపయోగించాలి). చర్మ సంరక్షణ విధానాల్లో దీర్ఘకాలిక వినియోగం, నిర్వహణీయత ముఖ్యం’’ అని ఆమె తెలిపారు.
టెన్ స్టెప్ దినచర్య ద్వారా రోజుకి రెండుసార్లు సమయం కేటాయించడానికి బదులు ఈ విధంగా చెయ్యమని డాక్టర్ బన్సాల్ సూచించారు:
- మేకప్ ఉపయోగించని వారు ఉదయం పూట ఆయిల్ క్లెన్సర్ వాడడం ఆపొచ్చు.
- ప్రతిరోజూ మృతకణాల్ని తొలగించుకోవాల్సిన పని లేదు.
- ఏహెఏలు, బీహెచ్ఏలు వల్ల రియాక్షన్ రావొచ్చు కాబట్టి డెర్మటాలజిస్ట్ సూచన మేరకే వాటిని ఉపయోగించాలి. పీహెఏలను ఎంచుకోవడం మంచిది.
సలహా: కొరియన్ చర్మ సంరక్షణ విధానాల్ని ప్రయత్నించడానికి ముందు అది మీ చర్మానికి సూటవుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక డెర్మటాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది.
ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తుల వినియోగం
ప్రకృతి సిద్ధమైన పదార్థాలను, మూలికలను, ఆర్గానిక్ పదార్థాలను కలిపి వినియోగిస్తున్నారని చెప్తుండడంతో కొరియన్ చర్మ సంరక్షణ విధానం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘ఈ ఆర్గానిక్ లేదా సహజ పదార్థాలు విస్తృతమైన వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ఉన్నాయి’’ అని డాక్టర్ బన్సాల్ చెప్పారు.
ఆమె చెప్పిన దాన్ని బట్టి, కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలను ఇక్కడ చూద్దాం:
- కొబ్బరి నీళ్ళు, రోజ్ హైడ్రొసోల్ మరియు పులియబెట్టిన వాటి నుంచి సంగ్రహించిన వాటిని టోనర్స్ లో ఉపయోగిస్తారు.
- వయసు పెరగకుండా చేసే కొన్ని ఉత్పత్తుల్లో నత్తల శ్లేష్మాన్ని ఉపయోగిస్తారు. వయసు కనిపించకుండా ఉండేందుకు వాడే రెటినాయిడ్స్ లాగా ఇది చర్మాన్ని రెచ్చగొట్టదు.
- మొటిమల్ని తగ్గించే ఉత్పత్తుల్లో తేనెటీగ విషాన్ని ఉపయోగిస్తారు.
- సముద్రం నుంచి లభించే సాల్మన్ గుడ్ల లాంటి బయో యాక్టివ్స్ లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మాయిశ్చరైజర్లలో ఉపయోగిస్తారు.
- అతిమధురాన్ని భారతీయ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
- కార్బొనేటెడ్ లేదా స్పార్కిలింగ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుందని, అది లోతుగా శుభ్రం చేసే లక్షణాల వల్ల చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుందని కొందరు నమ్ముతారు.
- లోతుగా శుభ్రం చేసే లక్షణాలను కలిగి ఉన్నందున అగ్నిపర్వత బూడిదను కూడా ఉపయోగిస్తారు.