నిద్ర లేకపోవడానికి ఒక కారణం వ్యక్తిగత లేదా వృత్తి పరంగా ఒత్తిడి ఉండటం. ఒక వ్యక్తి తమ రోజు వారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి కారణంగా చిరాకు పెరిగి రాత్రి పూట నిద్రకు భంగం కలగవచ్చు. డెడ్‌లైన్స్, ఉత్పాదకత అలాగే సృజనాత్మకత ఉండాలి అనేది వృత్తిలో ఒత్తిడులకు కారణం కావచ్చు. ఈ ఒత్తిడిని తట్టుకుని మంచి నిద్ర వచ్చేలా చేసుకోవడం ఎలా? వ్యక్తిగత-వృత్తి పరమైన జీవితంలో సమతౌల్యం తీసుకురావడం అలాగే నిద్రపోయే వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు అని నిపుణులు అంటున్నారు.
“ప్రతీ ఒక్కరికి పని విషయంలో ఏదొక ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ ఒత్తిడి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించినప్పుడు, ఇది ఆందోళనగా మారుతుంది.” అని అన్నారు దేబంజన్ బెనర్జీ. ఈయన కలకత్తాలోని అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి(Apollo Multispeciality Hospital)లో కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ అలాగే సెక్సాలజిస్ట్.
జర్నల్ ఆఫ్ ఏజింగ్ అండ్ హెల్త్(Journal of Aging and Health )లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, పనికి సంబంధించిన విషయాలు అంటే పని వేళలు ముగిసిన తర్వాత కూడా పని చేయడం, షిఫ్ట్ వర్క్ అలాగే నెగెటివ్ ఎమోషనల్ అనుభవాలు నిద్రలేమికి దారీ తీస్తాయి. షిఫ్ట్ విధానంలో పని చేసేవారిలో ఇన్‌సోమ్నియా, అంటే నిద్రపట్టకపోవడం, నిద్ర మధ్యలో ఎక్కువ సార్లు మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టడం కష్టం అవ్వడం వంటి సమస్యలు ఎక్కువ.
ఒత్తిడి నిద్రను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
“ఒక మనిషికి ఎలాంటి అవాంతరాలు లేని ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర కావాలి. అయితే ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది నిద్ర పట్టకపోవడానికి అలాగే పట్టిన నిద్రకు భంగం కలగడానికి కారణం అవుతుంది. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారు రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేక మధ్య మధ్యలో మెలకువ వస్తూనే ఉంటుంది, కొంత మందిలో పీడకలలు, రకరకాల కలలు వస్తుంటాయి. వీరికి సాధారణ సమయం కంటే ముందే మెలకువ వస్తుంది, కానీ వీరు చురుకుగా ఉండరు.”
పనిలో ఒత్తిడి పని సమర్థతను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఒత్తిడి భరించలేనంతగా ఉంటే, ఇది వ్యక్తుల పని సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. “ఎక్కువ సార్లు పనికి సెలవు పెట్టడం, సమయ పాలనలో సమస్యలు, పని తక్కువ చేయడం అలాగే స్ఫూర్తి లేకపోవడం కనిపిస్తాయి. ఇది శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీని వలన రక్తపోటు, గుండె వ్యాధులు, ఊబకాయం, మధుమేహం అలాగే ఒంటి నొప్పులు వస్తుంటాయి.” అని డాక్టర్ బెనర్జీ అన్నారు.
“ఒత్తిడి వలన కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవచ్చు. ఇతరులతో సంబంధాలు, భద్రతా భావం, ఆత్మ విశ్వాసం తగ్గుతాయి. దీనితో పాటు, జీర్ణ వ్యవస్థపై కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, దీని వలన గ్యాస్ట్రైటిస్, అజీర్ణం, మలబద్ధకం అలాగే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (IBS) వంటివి వస్తాయి.” అని చెప్పారు. ఒక వ్యక్తికి దీర్ఘకాలంగా పనిలో ఒత్తిడి ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి అని నిపుణులు అంటున్నారు.
పనిలో ఒత్తిడిని నియంత్రణలో ఉంచి సరైన నిద్ర పట్టేలా చేసుకోవడానికి చిట్కాలు
ఒత్తిడిని తట్టుకోవడానికి నిపుణులు సూచిస్తున్ను చిట్కాలు:
• వ్యక్తిగత-వృత్తి జీవితాల మధ్య సమతౌల్యం:
వ్యక్తిగత-వృత్తి జీవితాల మధ్య సమతౌల్యం చాలా కీలకం. పని వేళలు నిర్దిష్టంగా ఉండాలి అలాగే నచ్చిన ఆసక్తులను ఆస్వాదించడానికి కూడా సమయం కేటాయించుకోవాలి.
• ఎక్కువ నడవడం:
కనీసం 30 నిమిషాలు పాటు ఎక్కువ దూరం నడవటం వలన మనసు తేలికపడి హార్మోన్‌లు నియంత్రణలోకి వస్తాయి.
• ప్రశాంతతనిచ్చే వ్యాయామాలు:
పనిలో ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు, రిలాక్సేషన్ అలాగే ప్రాణాయామ వ్యాయమాలను చేయడం వలన ప్రశాంతత వస్తుంది. వీటి వలన ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.
• సోషల్ మీడియా వినియోగం తగ్గించడం:
సోషల్ మీడియా అధికంగా వినియోగించడం వలన ఆత్రుత పెరిగి మీ వ్యక్తిగత అలాగే సామాజిక బంధాలు దెబ్బతినవచ్చు.
• రాత్రిపూట గ్యాడ్జెట్‌లు ఉపయోగించకపోవడం:
గ్యాడ్జెట్‌ల నుండి వచ్చే నీలి కాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. నిద్రపోవడానికి కనీసం 30 నిమిషాల ముందు నుండి గ్యాడ్జెట్‌లకు దూరంగా ఉండాలి.
• మద్యపానం మానేయడం:
మద్యం లేదా మాదకద్రవ్యాలు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎక్కువ కాలం పాటు వీటిని ఉపయోగించడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
• మీకు ప్రియమైన వారితో సమయం గడపడం:
మీకు ప్రియమైన వారితో సమయం గడపడం మీరు పడుతున్న ఇబ్బందులను పంచుకోవడం మీ పరిస్థితుల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే మీ కుటుంబం మరియు స్నేహితులతో మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది.
• నిద్రపోయే వాతావరణ పరిశుభ్రత:
నిద్రకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం, మంచాన్ని కేవలం నిద్రకు మాత్రమే ఉపయోగించడం అలాగే పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం మంచి నిద్రకు సహాయపడతాయి.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
• పనిలో ఒత్తిడి సహజం. అయితే, అది తీవ్రం అయినప్పుడు అది మీ శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వలన నిద్రకు భంగం కలుగుతుంది.
• వ్యక్తిగత-వృత్తి జీవితాల మధ్య సమతౌల్యం కీలకం అని నిపుణుల సూచన. శారీరకంగా చురుకుగా ఉండటం ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం ఒత్తిడిని నియంత్రించి మంచి నిద్రకు ఉపకరిస్తాయి.