
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలాగే వర్కవుట్ రొటీన్ ఆచరించడం అనేది బరువు-తగ్గడంలో కీలకం అని నిపుణులు అంటున్నారు
బరువు తగ్గడం అనేది అనేక ఒడిదుడుకులతో కూడిన ప్రయాణం. అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవడం అనేది కష్టతరం. దీనికి సహనం క్రమశిక్షణ అవసరం. నిరాశ అలాగే ఆచరణయోగ్యం కాని లక్ష్యాల కారణంగా అందరూ వారి రొటీన్ అనుసరించలేక మధ్యలోనే వదిలేయడంలో ఆశ్చర్యం లేదు.
కాబట్టి, సాధించగలిగే లక్ష్యాలను ఏర్పరుచుకోవడం అలాగే మీరు క్రమం తప్పకుండా ఉండటానికి మద్దతు చాలా కీలకం.
“బరువు తగ్గడానికి ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం అలాగే తరచు వ్యాయామం చేయడం” అని చెప్పారు చెన్నైఫోర్టిస్ మలార్ ఆసుపత్రి క్లినికల్ డైటిషీయన్ పిచ్చయ్య కాశీనాథన్.
మీ ఆరోగ్యకరమైన బరువు లక్ష్యాలను సాధించడానికి మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
1.ఆహారం తీసుకునేటప్పుడు పూర్తి అవగాహనతో ఉండండి
“మీరు ఏమి తింటున్నారు అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి” అని చెప్పారు పూణేలోని సహ్యాద్రి హాస్పిటల్స్(Sahyadri Hospitals) క్లినికల్ డైటిషియన్ మాళవిక కార్కారే. ప్రొటీన్ అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం మీకు కడుపు నిండుగా ఉన్నట్టుగా అనిపించి బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. క్యాలరీలు అధికంగా ఉండి పోషకాలు అతి తక్కువ ఉండే ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం అని ఆమె సూచించారు.
కొన్ని పానీయాలు క్యాలరీలతో నిండి ఉంటాయి అని, కాబట్టి చక్కెరతో నిండిన లేదా కార్బోనేటెడ్ పానీయాలకు బదులుగా నీళ్ళు లేదా చక్కెర లేని పానీయాలు తీసుకోవాలి అని కాశీనాథన్ తెలియజేసారు.
బెంగుళూరు సక్రా హాస్పిటల్(Sakra Hospital) క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శిల్పి సారస్వత్ మీ భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి అలాగే సరుకులు కొనుక్కునేటప్పుడు మీరు వ్రాసుకున్న లిస్ట్‌లోవి మాత్రమే తీసుకోండి. దీని వలన నియంత్రణ లేకుండా చేసే కొనుగోలు అవకాశాన్ని తగ్గిస్తుంది. మీరు ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటారు అని చెప్పారు.
2. తినే మోతాదుపై ఖచ్చితమైన నియంత్రణ
మోతాదు అంటే మీరు తీసుకునే ఆహార పరిమాణం. శరీరంలోని కొవ్వును తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మీరు తీసుకునే ఆహారం మోతాదుపై దృష్టి పెట్టడం కీలకం అని చెప్పారు కార్కారే. మోతాదు ఎక్కువగా తినే అలవాటు ఉన్న వారు నిరంతరం ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు అని పరిశోధనలు చెప్తున్నాయి, కాబట్టి మీరు తీసుకునే ఆహారం మోతాదును నియంత్రణలో ఉండటం కీలకం.
3. ఇంట్లో జంక్ ఫుడ్ ఉంచుకోవడం మానేయండి
కాశీనాథన్ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ “ఇంట్లో జంక్ ఫుడ్ తక్కువగా పెట్టుకోవడం వలన జంక్ ఫుడ్ అందుబాటులో ఉండక తక్కువగా తింటారు” అని సూచించారు. “[అయితే మరో వైపు] ఇంట్లో ఆరోగ్యకరమైన పోషకాహారం ఇంట్లో ఎక్కువగా ఉంచుకోవడం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుంది.” అని అన్నారు.
4.ఆకలి వేస్తుందా? మంచి నీళ్ళు త్రాగండి
నీరు తాగడం అనేది శరీరానికి మంచిది మాత్రమే కాదు, ఇది మీ ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది. నీరు త్రాగినప్పుడు మెదడుకు మీ కడుపు నిండినది అని సూచన అంది సహజంగానే ఆకలి తగ్గుతుంది. “ఇది ఆకలిని తగ్గించి మనం అధికంగా తినకుండా ఆపుతుంది” అని చెప్పారు కార్కారే.
హైడ్రైటెడ్‌గా ఉండటం వర్క్ అవుట్ పూర్తి చేయడంలో కూడా సహాయపడుతుంది అని బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని Cult.fitలో ఫిట్‌నెస్ ట్రైనర్ ఇస్మాయిల్ ముల్లా అభిప్రాయపడ్డారు. ఇది మీ కండరాలు, కీళ్ళు సమర్థవంతంగా పని చేసేలా చేయడమే కాదు, నీరు త్రాగడం వలన బరువు తగ్గే క్రమంలో నొప్పులు నీరసం రాకుండా సహాయపడుతుంది అని ఆయన అన్నారు.
మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి త్రాగడం వలన శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా ఖనిజాలు అలాగే విటమిన్లు వంటి కావలసిన పోషకాలు కూడా అందుతాయి అని కాశీనాథన్ వెల్లడించారు.
5. ఆరోగ్యకరమైన అలాగే ఆర్గానిక్ ఆహార యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి
ఈ కాలంలో, అతి తక్కువ సమయంలో మీకు ఆహారం డెలివరీ చేయగలిగే అనేక ఫోన్ యాప్‌లు ఉన్నాయి. కానీ ఈ యాప్‌ల వినియోగం మానేయడం లేదా తగ్గించడం చాలా కీలకం అని లేకపోతే బరువు తగ్గే ప్రక్రియకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
“ఏ సమయంలోనైనా ఆర్డర్ చేసుకోగలిగే సౌలభ్యం వలన అవసరమైన దాని కంటే ఎక్కువగా తినడం అలాగే అనారోగ్యకరమైనవి తినడానికి దారి తీస్తుంది” అని అన్నారు కాశీనాథన్. ఎవరైనా బరువు తగ్గాలి అని అనుకుంటున్నప్పుడు, ఇంట్లో వంట చేసుకోవడం లేదా ఆర్గానిక్ పండ్లు అలాగే కూరగాయలు తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు.
ఆన్‌లైన్ లేదా రెస్టారెంట్‌లో ఆహారం తినేటప్పుడు ముందుగా క్యాలరీలు చూసుకోవాలి. అలాగే పోషకాహారం ఎంత ఉందో కూడా చూసుకుని, అవి మీ బరువు తగ్గే పయనానికి సరిపోతుందా లేదా అని ఆలోచించి నిర్ణయించుకోవాలి అని సలహా ఇచ్చారు.
6. మీ మొబైల్ లేదా టాబ్లెట్ మంచం పక్కన పెట్టుకోవద్దు
“అర్థరాత్రి పూట ఎలక్ట్రానిక్ వస్తువుల కాంతికి గురి కావడం వలన సహజ సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని మెలటోనిన్ ఉత్పత్తి ఆలస్యం అవుతుంది” అని అన్నారు కాశీనాథన్.
మెలటోనిన్ మీ నిద్ర సమయాన్ని మేల్కొనే సమయాన్ని నియంత్రిస్తుంది. దీని ఉత్పత్తి ఆలస్యం అయినప్పుడు నిద్రపట్టడం అలాగే నిద్రపోవడం ఇబ్బంది అవుతుంది.
నిద్ర సరిగ్గా లేకపోవడం వలన హార్మోన్లలో అసమతౌల్యం ఏర్పడి, శరీరం బరువు తగ్గడం కష్టం అవుతుంది.
“రాత్రి పూట బాగా ఆలస్యంగా భోజనం చేయడం వలన కూడా నిద్ర ఆలస్యం అవ్వడం, సరిగ్గా పట్టకపోవడం జరుగుతుంది,” అని అన్నారు.
7. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని బావోద్వేగపరమైన తిండిని నియంత్రణలో ఉంచుకోండి
“ఒత్తిడి వలన ఆహారపు అలవాట్లు ప్రభావితం అవుతాయి” అని అన్నారు సారస్వత్. మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన కొంత మంది తినడం మానేస్తే కొందరు నియంత్రణ లేకుండా తింటారు.
ఒత్తిడి కారణంగా ఉండే అధిక కార్టిసాల్ స్థాయి ఆకలిని నియంత్రించి అనారోగ్యకరమైన ఆహారం తింటారు. కాబట్టి ఒత్తిడి కారణంగా బరువు తగ్గడం ఇబ్బంది అవుతుంది, అని చెప్పారు ఆవిడ.
ఆరోగ్యకరమైన ఆహారం ఒకచోట రాసుకోవడం మంచిది. అది చిన్న చిరుతిండి అయినా సరే రాసిపెట్టుకోవడం మంచిది అని సూచిస్తున్నారు డాక్టర్ సారస్వత్. దీని వలన మీరు ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. దీని వలన మీరు మీ ఆహారంలో కావలసిన మార్పులు చేసుకోవచ్చు.
8. ఇంటి నుండి కాస్త దూరం వెళ్తున్నారా, డ్రైవింగ్ కంటే వాకింగ్ మంచిది
“మీరు తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువ ఖర్చు చేయడమే బరువు తగ్గడం” అని అన్నారు ముల్లా. “ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయడానికి తరచుగా వ్యాయామం చేయడం చాలా కీలకం. నడక అన్నింటి కంటే ఉత్తమమైన వ్యాయామం. మీరు దగ్గరి ప్రాంతాలకు నడిచి వెళ్ళడం మంచిది.”
బరువు తగ్గాలి అనుకునే వారు సరైన వర్క్ అవుట్ ఎన్నుకోవడం మంచిది, అది యోగా అయినా, రన్నింగ్ అయినా, సైక్లింగ్ లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి. ఆ తర్వాత ఆ వర్క్ అవుట్ క్రమం తప్పకపోవడం కీలకం.