
అల్జీమర్స్ పరిశోధకులు నివారణ కోసం కుంకుమపువ్వును సూచించారు. పరిశోధనల్లో దీని ప్రభావం వెల్లడైంది. మెదడులోంచి ఎమిలాయిడ్ బీటా సమూహాల్ని తొలగించడం ద్వారా కుంకుమపువ్వు అల్జీమర్స్ పురోగతి వేగం తగ్గించడంలో కుంకుమపువ్వు సారం నమ్మకం కలిగిస్తోంది.
65 ఏళ్ళు పైబడిన వాళ్ళలో కలిగే మతి భ్రమణం(డిమెన్షియా), జ్ఞాపకశక్తిని కోల్పోవడం లాంటి సమస్యలకు అత్యంత సాధారణ రూపం అల్జీమర్స్ వ్యాధి. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, వయసు పెరగడమే అల్జీమర్స్ కి ప్రధానమైన అపాయకర కారకంగా మారింది.
అల్జీమర్స్ సమస్యను ఎదుర్కొంటున్న వారు జ్ఞాపకశక్తిని శాశ్వతంగా కోల్పోతారు. రోజువారీ పనుల్ని చేసుకోలేరు. ఆలోచించలేరు లేదా కొత్త పనులు నేర్చుకోలేరు. ఈ వ్యాధి వారి ప్రవర్తన పై కూడా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు బాగా ఇంపల్సివ్ గా మారతారు, స్థితి భ్రాంతి కలుగుతుంది. ఊహాతీతంగా ప్రవర్తస్తారు. ఏళ్ళు గడిచేకొద్దీ వీటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది.
మెదడులోని నాడీకణాలకు నష్టం జరగడం వల్ల ఈ వ్యక్తుల పరిస్థితి చాలా వేగంగా క్షీణిస్తూ ఉంటుంది. అది మరింతగా పెరిగిపోతుంది. ఎమిలాయిడ్ బీటా, టా అనే ప్రోటీన్లు మెదడు కణజాలంలో పేరుకోవడం వల్ల నాడీకణాల నష్టం జరుగుతుంది. దాంతో నాడీ కణాల మధ్య సమాచారమార్పిడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అల్జీమర్స్ కి దారి తీసే ఇతర కారణాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు.
ప్రస్తుతానికి అల్జీమర్స్ కి ప్రసిద్ధమైన చికిత్స ఏదీ లేదు. కాబట్టి ఈ వ్యాధి పురోగమించకుండా వేగం తగ్గించాలంటే ముందుగా రోగ నిర్ధారణ చెయ్యడం ఒక్కటే మార్గం. న్యూరోట్రాన్స్‌మిటర్ యాక్టీవిటీలో కలిగిన అసమతౌల్యం వల్ల కలిగే లక్షణాల్ని తగ్గించడానికి డాక్టర్లు సూచించే కొన్ని మందులు సహాయపడతాయి. (మెదడులో నాడీ కణాల మధ్య సమాచార మార్పిడిని సాధ్యం చేసే రసాయన వాహకాల్ని న్యూరో ట్రాన్స్ మిటర్లు అంటారు). ఇటీవల జరిగిన పురోగతిలో, ఈసాయ్(Eisai) అనే జపాన్ కంపెనీ, యూఎస్ బయోటెక్ కంపెనీ బయోజెన్ తయారు చేసిన లెకనేమాబ్ అనే ఒక మందు అల్జీమర్స్ పురోగతి వేగాన్ని తగ్గించిందని వైద్య పరోశోధనల్లో వెల్లడైంది.
వృక్ష ఆధారిత ఔషధ మిశ్రమాలు:
అయితే దుష్ఫలితాలు లేకుండా మందులు ఉండవు. గత రెండు దశాబ్దాలుగా పరిశోధకులు అల్జీమర్స్ చికిత్సకు ఉపయోగపడే వృక్షాల మూలికల సారాల్లోని బయో యాక్టివ్ ఔషధ మిశ్రామల గురించి కూడా శోధించడం మొదలుపెట్టారు. కుంకుమపువ్వు, పసుపు, ఉసిరికాయల్లోని యాక్టివ్ మిశ్రమాలకు ఎమిలాయిడ్ బీటా క్లస్టర్స్ ని తగ్గించే శక్తి ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాక కుంకుమపువ్వు శక్తివంతమైన యాంటాక్సిడెంట్ గా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పేరు పొందింది.
జర్నల్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్ లో 2016లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకులు 17 మంది అల్జీమర్స్ రోగులున్న ఒక చిన్న గ్రూప్ కి 12 నెలల పాటు కుంకుమపువ్వు గుళికలు ఇచ్చారు. స్వల్ఫమైన దుష్ఫ్రభావాలు ఉన్నప్పటికీ ఆ గ్రూపు అభిజ్ఞాన సామర్థ్యాలు మెరుగయ్యాయని వాళ్ళు కనుగొన్నారు.
ఏసీఎస్ ఒమేగాలో ప్రచురితమైన మరొక పరిశోధనలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, జమ్మూ(ఐఐఐఎమ్-జమ్మూ) కి చెందిన పరిశోధకులు కుంకమపువ్వు శక్తి గురించి పరిశోధనలు చేశారు. కుంకుమ పువ్వు కేశాగ్రంలో క్రోసిన్ అనే రసాయన మిశ్రమం ఉంటుందని, దానిలో 16 యాక్టివ్ యాంటీ అల్జీమర్స్ రసాయనాలున్నాయని వాళ్ళు కనుగొన్నారు.
ఎమిలాయిడ్ బీటా క్లస్టర్లను తొలగించడంలో కుంకుమ పువ్వు సారానికి, అలాగే దానిలోని క్రోసిన్ కి ఉన్న సామర్థ్యాన్ని ఆ టీం అంచనా వేసింది.
ఐఐఐఎమ్-జమ్మూలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ సందీప్ బి. భారాటే హ్యీపీయెస్ట్ హెల్త్‌తో మాట్లాడారు. ‘‘కుంకుమపువ్వులో ఉండే రసాయనాల్లో క్రోసిన్స్ ప్రధానమైన ప్రో డ్రగ్స్‌లాగా పని చేస్తాయి. కుంకుమపువ్వు లేదా దాని సారాన్ని నోటి ద్వారా తీసుకున్నప్పుడు కుంకుమపువ్వులో ఉండే క్రోసిన్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్‌లో క్రోసిటిన్‌గా మారతాయి. క్రోసెటిన్ పొరలగుండా చొచ్చుకుపోతుంది. అది రక్తప్రసరణలో కలుస్తుంది. తర్వాత అది రక్తానికి-మెదడుకి మధ్య మెదడులో ఉండే అడ్డంకిని అధిగమించి యాంటీ ఆల్జీమర్ యాక్టివిటీ మొదలుపెడుతుంది’’ అని ఆయన వివరించారు. రక్తానికి, మెదడుకి మధ్య ఉండే పాక్షిక పారగమ్య రక్షణ పొర మెదడుని కాపాడుతుంది.
మెదుడులోని ఎమిలాయిడ్ క్లస్టర్ ని క్రోసెటిన్ రెండు విధాలుగా తొలగిస్తుందని ఆయన వివరించారు. ‘‘మొదట, క్రోసెటిన్ మెదడులో ఆటోఫాజీ(కణం స్వయంగా విషపదార్థాలను తొలగించుకునే విధానం) ప్రారంభిస్తుంది. రెండోది, రక్తం-మెదడు అడ్డంకి దగ్గర ఉండే పీజీపీ అనే రవాణా ప్రోటీన్ కార్యకలాపాల్ని పెంచుతుంది. అది మెదడులోని ఎమిలాయిడ్ బీటాని రక్తంలోకి నెట్టి బయటికి పంపిస్తుంది’’ అని ఆయన అన్నారు. ఇంతకు ముందు మేం నిర్వహించిన వైద్య పరిశోధనల్లో కుంకుమ పువ్వు సారం జంతువుల్లో జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాల్ని పెంచినట్టు తేలింది. అలాగే కుంకుమ పువ్వు సారం అలాగే దాని నుంచి తీసిన రసాయన సమ్మేళనం ఎలాంటి దుష్ప్రభావాల్ని కలిగించలేదని ఆయన చెప్పారు.
రక్తానికి-మెదడుకి మధ్య అడ్డంకిని క్రోసెటిన్ దాటి వెళ్ళగలదని మరొక అధ్యయనంలో తేలింది.
ఆయుర్వేదం ఏం చెబుతోంది
భారతదేశంలో కుంకుమపువ్వు లేదా కేసరిని ఔషధంగా, మసాలా దినుసుగా, సౌందర్య సాధనాల్లో సంప్రదాయంగా వినియోగిస్తారు.
ఆగ్రాకి చెందిన ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ అమిత్ శర్మ మానసిక సామర్థ్యంలోని మూడు కోణాల గురించి ఆయుర్వేద రచనల్లో ఉంది అంటున్నారు. అవి ధీ(నేర్చుకోవడం), ధుతి(నిలుపుకోవడం), స్మృతి(గుర్తుతెచ్చుకోవడం). ఈ మూడు మానసిక ప్రక్రియల్లో గనక లోపం వస్తే మతిభ్రమిస్తుంది.
‘‘ఆల్జీమర్స్ వచ్చిన ప్రారంభ దశలోని లక్షణాలకు మేం కుంకుమపువ్వు, పసుపు, ఉసిరికాయలతో ఉన్న మిశ్రమాన్ని మందుగా ఇస్తాం’’ అని ఆయన అన్నారు. అశ్వగంధ, శంఖపుష్పి, గోటు కోలా లాంటి మూలికల మిశ్రమాన్ని దాని సంబంధిత లక్షణాలను బట్టి ఇస్తాం.
అధ్యయన ఫలితాలు ప్రోత్సహించేలా ఉన్నాయి
కుంకుమ పువ్వు ఉత్సాహాన్ని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. సెరొటోనిన్, డోపమైన్, నోరీపైనెప్రైన్ లాంటి న్యూరో ట్రాన్స్ మిటర్ల స్థాయిని కుంకుమ పువ్వు పెంచుతుందని, ఒత్తిడి, ఆందోళన, మతి భ్రమణాలను తగ్గించడానికి అవి సహాయపడతాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
‘‘ఎమిలాయిడ్ బీటా విషపూరితమైన ప్రభావాల నుంచి, ఇన్ ఫ్లమేషన్ నుంచి న్యూరాన్లను కుంకుమ పువ్వు రక్షిస్తుందని కూడా మేం కనుగొన్నాం. కాబట్టి అల్జీమర్స్ వ్యాధి పురోగతి వేగాన్ని తగ్గించడానికి కూడా కుంకుమ పువ్వు సమర్థవంతంగా పని చేస్తుంది’’ అని డాక్టర్ భరాటే అన్నారు. కుంకుమ పువ్వు సారంతో గుళికలు తయారుచెయ్యడానికి చాలా దేశాల్లోని శాస్త్రవేత్తలు పేటెంట్ల కోసం కూడా ధరఖాస్తు చేస్తున్నారని ఆయన తెలిపారు.