
వారాంతపు విహారయాత్రను ఆస్వాదించడంతోపాటు దాన్ని ఆరోగ్య ప్రదాతగా, ఆత్మీయులతో బంధం బలపరచేదిగా, పునరుత్తేజం ఇచ్చేదిగా మలచుకునే మార్గాల గురించి ఆరోగ్య జీవన విధాన (Wellbeing) నిపుణులు కొన్ని అంశాలను మనతో పంచుకుంటున్నారు.
మీ కుటుంబ సభ్యులు లేదా మిత్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారాంతపు విహార యాత్రకు బయల్దేరే సమయం రానే వచ్చింది. సరంజామా అంతా ఎప్పుడో సిద్ధమైంది. మీలోని ఔత్సాహిక విహారి ఎంతో ఉత్సాహంతో శోధించి సుందర సందర్శన ప్రదేశాలను, బస కోసం (సెల్ఫీలకు అనువైన) రెస్టారెంట్లు, కఫేలను కూడా అప్పటికే ఎంపిక చేసేశారు. సెలవు రోజుల ఆనంద ఆస్వాదన నేపథ్యం సాధారణంగా ఇలాగే ఉంటుంది.
ఇలాంటి ప్రయాణాన్ని మీరు శారీరక, మానసిక స్వస్థత చేకూర్చే మార్గంగా భావిస్తుంటే– ముఖ్యంగా మీ ఆత్మీయులతో యోగా లేదా ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవడం ఖర్చుతో కూడినదైనప్పుడు, మీ వారాంతపు విహారయాత్రనే ఆరోగ్య ప్రదాతగా మలచుకునే మార్గాలివే:
బంధం బలపడటమే లక్ష్యం
క్రమం తప్పకుండా విహార యాత్రలు చేసేవారు దాన్ని ఫొటోలు, జ్ఞాపకాలుగా భద్రపరచుకునే ఒక అనుభవంలా కాకుండా సైక్లింగ్, సుదీర్ఘ నడక, కాఫీ లేదా వైన్ తోటల సందర్శన– వంటి ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంపై దృష్టి సారిస్తారు.
అయితే, “దీన్ని [విహార యాత్రను] బంధం బలపరచే మార్గంగా చూడండి! ఆనందానికి అదే ఆరంభం” అని ముంబైకి చెందిన సైకో–థెరపిస్ట్, ‘మైండ్ ఫ్యాక్టరీ’ (Mind Factory) వ్యవస్థాపకులు డాక్టర్ విహాన్ సన్యాల్ సూచిస్తున్నారు.
బంధం బలపరచుకోవడం వెనుక వాస్తవ కారణాన్ని గుర్తించాలని ఆయన అంటున్నారు. “ఈ విహారయాత్ర (పరమార్థం) సామరస్యం కొరవడిన మిత్రులు లేదా కుటుంబసభ్యులు తమ విభేదాలను వీడి ఏకం కావడం కోసమా? లేక ఆ బంధాన్ని మరింత గట్టిగా పెనవేసి, పటిష్ఠం చేసుకోవడానికా? అన్నది నిర్ణయించుకోండి. అందుకు తగిన కార్యకలాపాలపై దృష్టి పెట్టండి” అని ఆయన సూచిస్తున్నారు.
మూకాభినయం లేదా అంత్యాక్షరి * వంటి సామూహిక వినోద కార్యకలాపాలు బృందంలోని సభ్యులంతా కలసిపోయేందుకు తోడ్పడతాయి. “[ఈ రోజుల్లో] ఓ చిన్న ఫోన్ సందేశం కూడా సంబంధాలు తెంచుకోవడానికి కారణం అవుతోంది. కాబట్టి ఇలాంటి విహార యాత్రలలో పరస్పర సామాజిక సంభాషణలకు ప్రాధాన్యం ఇవ్వాలి.”
(*అంత్యాక్షరి అనేది ఏదైనా భారతదేశపు చలనచిత్ర గీతంలోని చివరి అక్షరం ఆధారంగా ఆడే ఆట: ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ బృందాలు పాల్గొంటాయి. ఒక బృందం బాగా ప్రాచుర్యం పొందిన సినిమా పాట చరణం ఆలపిస్తే– అందులోని చివరి అక్షరంతో అవతలి బృందం మరో పాట చరణంతో ప్రతిస్పందించాలి).
చలిమంటల నడుమ మనోభావనలను స్పృశించండి
“మంచి శ్రోతలుగా మారండి. చలిమంటల నడుమ అందరి మనోభావాలను స్పృశిస్తూ భావోద్వేగాలను పంచుకునేలా ప్రోత్సహించండి” అని బెంగళూరులోని ప్రవర్తన-ఆరోగ్య వేదిక ‘మైండ్ఫుల్లీ సార్టెడ్’ (Mindfully Sorted) సంస్థ వ్యవస్థాపకురాలు శర్మిష్ట మజుందార్ సూచిస్తున్నారు. స్వస్థతను అభిలషించేవారి కోసం విహార, ఏకాగ్రత యాత్రల వంటి కార్యక్రమాలను ఈ సంస్థ రూపొందిస్తుంది. విహార యాత్ర సమయంలో సహ పర్యాటకులతో మమేకం కావాల్సిందిగా ఆమె సూచించారు. ఇందులో భాగంగా “ఏంటి సంగతులు?” అని పలకరింపుగా కాకుండా “మీకు ఈ క్షణంలో ఏమనిపిస్తోంది?” అంటూ మదిలోని భావాన్ని కదిలించేలా సంభాషణకు నాంది పలకాలని చెబుతున్నారు.
“సలహాలివ్వడం లేదా మన అభిప్రాయం చెప్పడం కాకుండా మనోభావాలు పరస్పరం పంచుకునే వాతావరణం కల్పించండి; శ్రద్ధగా వినండి… సానుభూతి ప్రకటించండి. మనోభావాలను పంచుకుంటే భావోద్వేగ భారం దించుకోవచ్చు. దీనివల్ల మనసు తేలికపడి, ఆనందానుభూతి కలుగుతుంది” అని ఆమె సలహా ఇస్తున్నారు.
సామూహిక విహారయాత్రలను అర్థవంతమైన, ఒత్తిడిని వదిలించుకునే అనుభవాలుగా మార్చుకోవడానికి శ్రోతలుగా మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలను డాక్టర్ సన్యాల్ ఇలా వివరించారు:
- తమనుతాము వ్యక్తీకరించుకునే వారికి తగిన గౌరవం ఇవ్వండి.
- వారి మాటలకు అడ్డుపడకుండా, మరింత మాట్లాడేలా ప్రోత్సహించండి.
- ఆత్మపరిశీలనలో సహాయపడేలా సున్నితంగా, సరళంగా ప్రశ్నించండి.
- మీ అభిప్రాయాన్ని తక్షణమే ప్రకటించకండి.
- కట్టెవిరుపు ప్రకటనలను నివారించండి.
“ఇవి మంచి శ్రోతలకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు మాత్రమే. ఈ ప్రక్రియలో మీరు ఆ వ్యక్తులకు సంబంధించిన ఆసక్తికర అంశాలను గ్రహించవచ్చు. వారి అంతరంగాన్ని మరింత లోతుగా తెలుసుకోవచ్చు. తద్వారా వారి మనోవేదనను అర్థం చేసుకోవచ్చు. ఏవైనా హెచ్చరికల సంకేతాలు కనిపిస్తే- వారికి [తగిన నిపుణులను సంప్రదించడంలో] మీరు మార్గనిర్దేశం చేయగలరు” అని డాక్టర్ సన్యాల్ చెప్పారు.
ప్రయాణంలో శ్వాసపై ధ్యాసకు యత్నించండి
మరొకటి కూడా ఉంది. అదే ధ్యానం- ఇది శ్వాసపై తదేక ధ్యాస నిలపడం గురించి చెప్పే పదం. ధ్యానం ప్రత్యేకత గురించి కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్ నివాసి, ధ్యాన బోధకులు, స్వస్థత నిపుణులైన జే బ్రాడ్లీ– “ఇది ఏ వేళనైనా చేయగలిగే ప్రక్రియ. మనం ప్రయాణంలో ఉన్నా, సెలవులు గడుపుతున్నా, ఓ స్ఫూర్తిదాయక భావన కలగాలంటే ధ్యానం చేయవచ్చు” అంటున్నారు.
“మీకిష్టమైన సంగీతం ఆస్వాదిస్తూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవడం ఉత్తమం. అందుకోసం పోర్టబుల్ స్పీకర్ జోడించిన సెల్ ఫోన్ వాడుకోవచ్చు. మరింత ప్రశాంతత లేదా అంతరంగం లోతుల్లోకి వెళ్లడం కోసం కళ్లకు మాస్క్ ధరించడం లేదా వస్త్రం చుట్టుకోవడం మంచిది. అలాగే ఓ గుండె, రెండు ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ అవసరం!” అని చమత్కరించారు.
భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనకు తోడ్పడే మూడు-భాగాల ధ్యాన ప్రక్రియను బ్రాడ్లీ సూచిస్తున్నారు. “అయితే– ఎవరికి అనువైన, ఆచరణీయ శ్వాస ప్రక్రియను వారు అభ్యసించవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా దాన్ని సాధన చేయవచ్చు” అని వివరించారు.
మానసిక ఆరోగ్యం, శారీరక శ్రేయస్సుకు తోడ్పడే అత్యంత శక్తిమంతమైన ఏకైక పద్థతి ఇదేనని ఆయన అంటారు. “ఇది మిమ్మల్ని అంతరంగ శోధనలో చాలా లోతుకు తీసుకెళ్తుంది. ప్రతిరోజూ లేదా సాధారణ సంభాషణాత్మక చికిత్సలో సహజంగా మనకు తటస్థపడని భావోద్వేగాలు, అవరోధాలు, వేదన, గాయాల అనుభూతిని సంగ్రహించడంలో ఇది సాయపడుతుంది” అని వివరించారు.
సామూహికంగా ఏదైనా సృష్టించండి
మనోభావాలు పంచుకోవడానికి, సంభాషణకు దారితీసే కార్యకలాపాలు చేపట్టడం చాలా మంచి ప్రయత్నం. ఇందులో భాగంగా మండల చిత్రకళ, వంటలు లేదా కళాఖండాల సృష్టి లేదా దైనందిన ముఖ్యాంశాలను పంచుకోవడం వగైరా పనులను సామూహికంగా చేయాలని బెంగళూరు వాస్తవ్యురాలైన ‘ఈవెంట్ క్యూరేటర్’ ఏక్తా సింగ్ సూచిస్తున్నారు. “మానసిక, శారీరక ఉత్తేజం కోసం మనం చేయదగినవి ఎన్నో ఉన్నాయి. కుదురుగా కూర్చుని ఏదైనా రాయడం, ధన్యవాద లేఖనం, వ్యవసాయం, తోటపని, ఏకాగ్రత సాధన వంటివి ఏవైనా చేయవచ్చు” అని ఆమె విశదీకరించారు.
కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే సరదాగా ఉండటమేగాక విసుగెత్తించే మూస ఆలోచనా ధోరణి స్థానంలో మన అంతఃచేతన కొత్త దృక్కోణాలను అలవరచుకునే వీలుంటుంది. ఇది మనసును ఉత్సాహంతో ఉరకలేసే విధంగా మారుస్తుందని మజుందార్ అభిప్రాయపడ్డారు.
లేఖన శక్తిని అందిపుచ్చుకోండి
కొత్త సామాజిక బృందాల్లో ప్రవేశించడానికి ప్రయత్నించేవారు తమ భావాలను పంచుకునే మంచి మార్గాలున్నాయి. ఆ మేరకు– మనం చేయదలచిన పనుల జాబితా రాసుకోవడం, అసంబద్ధ ఆలోచనలకు స్వస్తి చెప్పడం, ప్రాథమ్యాల నిర్ణయం, కృతజ్ఞతలు తెలపడం లేదా యాదృచ్ఛిక ఆలోచనలకు అక్షర రూపమివ్వడం వంటివి మానసిక విశ్రాంతికి ఉత్తమ మార్గాలు.
ఇదొక సామూహిక కసరత్తుగానూ ఉండవచ్చు. “ఒక బృందంలో సభ్యులుగా ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించవచ్చు. ఏళ్ల తరబడి చేసిన పర్యటనల గురించి ఓ 10 నిమిషాలు రాయవచ్చు. వాటిని చదువుతూ, ఇతరులతో పంచుకోవడం సరదాగానూ ఉంటుంది” అని మజుందార్ కొన్ని సూచనలు చేశారు.
“మీకు సౌకర్యంగా అనిపించే ప్రదేశంలో కూర్చోండి. మనోభంగం కలిగించిన విషయాల గురించి ఆలోచించండి. వాటి జాబితా రాయండి. పక్కనే రగులుతున్న చలిమంటలో ఆ కాగితాన్ని బూడిద చేయండి” తద్వారా చేదు సంఘటనలు, జ్ఞాపకాలను మీ మనస్సులో నుంచి మంటలోకి నెట్టేయండి” అని ఏక్తా సింగ్ సూచిస్తున్నారు.
ధ్యానం, వ్యాయామం
నిత్యం తెల్లవారుజామున ధ్యానం చేస్తే శారీరక–మానసిక శ్రేయస్సు మెరుగుదలకు చక్కగా తోడ్పడుతుంది. యోగా, శ్వాస ప్రక్రియ, ధ్యానం కోసం ఒక బృందంగా ఏర్పడి, ఓ శిక్షకుడిని నియమించుకుని అభ్యసించండి” అని డాక్టర్ సన్యాల్ సూచించారు.
‘వర్తమానం’లో జీవించండి
‘ఆ క్షణంలో జీవనం’ ప్రాధాన్యాన్ని ఆరోగ్య నిపుణులు చాలా కాలంనుంచీ నొక్కిచెబుతూనే ఉన్నారు. ఎక్కడికైనా వెళ్లడం ఇందుకు ఒక మంచి మార్గం కాగలదు.
ఓ చెట్టును కౌగలించుకోవడంతో ప్రారంభించండి- “కళ్లు మూసుకుని, ఓ చెట్టును గట్టిగా కౌగిలించుకోండి. ఆ వృక్షరాజంతో మీ రహస్యాలను గుసగుసగా పంచుకోండి. ఈ కౌగిలింత వల్ల ‘ఆక్సిటోసిన్’ హార్మోన్ విడుదలై మనసును కుదుటపరచి, ఆశావహ భావనను పెంచుతుంది” అని మజుందార్ సూచించారు.
లేఖనం ప్రక్రియను కూడా మనం ప్రయత్నించవచ్చు. ఇది మన ఏకాగ్రత పెంచడంలో సాయపడగల శక్తిమంతమైన సాధనమని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లాస క్షణాలను ఇలా సృష్టించుకోండి
ఏదైనా సామూహిక విహార యాత్రలో అనుభవాన్వేషక యాత్రికులుగా పాల్గొనేవారి కోసం బెంగళూరుకు చెందిన ప్రవర్తనా నైపుణ్య శిక్షకుడు సుధీర్ ఉదయకాంత్ చక్కని మార్గదర్శకాలను సూచిస్తున్నారు:
- మీరు మీ విహారయాత్ర గమ్యాన్ని చేరిన తర్వాత ఇల్లు, ఇతర ‘ప్రపంచం’ గురించి పూర్తిగా మరచిపొండి.
- ముందుగా (మీతోపాటు బృందంలో అందరూ) ఫోన్లను వీలైనంత దూరంగా ఉంచండి.
- కలిసి భోజనం చేయండి; ఈ అవకాశాన్ని ఏ ఒక్కరూ వదులుకోవద్దు.
- ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలన్నీ తినండి.
- సామూహిక కార్యక్రమాలకు సమయపాలన అవశ్యం: అందరితో– ముఖ్యంగా మీకు సేవలందించే వారితో మర్యాదగా, శ్రద్ధగా మెలగండి.
- ఇతర సభ్యులందరితో సాధారణ, ఆహ్లాదకర, వినోదభరిత అంశాలపై సున్నిత, సన్నిహిత సంభాషణకు ప్రయత్నించండి.
- మీరు గమనించిన ఆసక్తికర అంశాల గురించి మాట్లాడండి.
- సౌకర్యవంతమైన పాదరక్షలతో ప్రకృతి నడకను దినచర్యలో భాగం చేసుకోండి.
- మీకిష్టమైన పుస్తకాన్ని కూడా వెంట తీసుకెళ్లండి.
- ప్రతి ఒక్కరూ స్వీయ నిర్ణయాలకు తావులేని, తమంతట తాముగా మెలిగే, సురక్షిత, కలుపుగోలు బృందంగా రూపొందండి.