తీవ్రమైన కీళ్ళ నొప్పులకు అనేక కారణాలు ఉండవచ్చు, వయస్సు, కీళ్ళు అరిగిపోవడం, గాయాలు అలాగే ఆటోఇమ్యూన్ రుగ్మతలు. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్య తీవ్రం కావచ్చు.

ప్రపంచవ్యాప్తంగా తీసుకునే ఆహారంలో గణనీయమైన మార్పు వచ్చింది, చాలా మందికి ప్రాసెస్ చేసిన ఆహారం సాధారణం అయిపోయింది. “మనం నివసిస్తున్న ప్రపంచంలో ప్రతీది ప్రాసెస్ చేసినదే, మన ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుండి తినే స్వీట్ వరకు” అని అభిప్రాయపడ్డారు బెంగుళూరుకు చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అలాగే డయాబెటిస్ ఎడ్యుకేటర్ సఫియా అఫ్రైన్ కె. దీనికి తోడు ప్రజలలో తీవ్రమైన కీళ్ల సమస్యలు పెరగడం ఒకే సమయంలో జరిగింది.
అయితే, ప్రాసెస్ చేసిన ఆహారానికి, కీళ్ల నొప్పులు రావడానికి మధ్య సంబంధం ఉందా?
ప్రాసెస్ చేసిన ఆహారం కారణంగా కీళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయా?
ప్రాసెస్ చేయబడిన ఆహార వినియోగం మరియు దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల ప్రమాదానికి మధ్య ఒక స్పష్టమైన సంబంధాన్ని పరిశోధనలు కనుగొనగలిగాయి. కీళ్ల నొప్పులు వయస్సు, అరుగుదల, గాయాలు మరియు ఆటోఇమ్యూన్ రుగ్మతలతో సహా అనేక కారణాలను కలిగి ఉన్నప్పటికీ, ఆహారం యొక్క పాత్రను విస్మరించలేము.
“అవి [ప్రాసెస్ చేయబడిన ఆహారం] వివిధ చక్కెరలు, లవణాలు మరియు ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉంటాయి, ఇవి మన శరీరానికి ఇన్‌ఫ్లమేటరీ కారకాలుగా పనిచేస్తాయి. ప్రాసెస్ చేయబడిన ఆహారం యొక్క ప్రధాన ప్రభావం ఇది” అని అర్ఫైన్ చెప్పారు.
ప్రాసెస్ చేసిన ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారంలో కీలక పోషకాలు ఉండవు, అంటే యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల వంటివి, వీటిలో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
“సాధారణంగా ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే సంతృప్త కొవ్వులు, వంట చేసేటప్పుడు అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు, మన శరీరంలో హానికరమైన రసాయనాల సంఖ్యను పెంచుతాయి. ఇది అధునాతన గ్లైకోసైలేషన్ ఉత్పత్తులను ఏర్పరుస్తుంది, ఇది మరింత ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది” అని అర్ఫైన్ చెప్పారు.
ప్రాసెస్ చేసిన ఆహారంలో సాధారణంగానే క్యాలరీలు ఎక్కువ ఉంటాయి, పోషకాలు తక్కువ ఉంటాయి. దీని వలన బరువు పెరుగుతుంది, కీళ్ల పై ఒత్తిడి పడుతుంది. తద్వారా కీళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.
కీళ్ల ఆరోగ్యంపై ప్రాసెస్ చేసిన ఆహారం ప్రభావం ఏమిటి?
ప్రాసెస్ చేసిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్లు, అధిక ప్రక్టోస్-కార్న్ సిరప్, రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్‌లు అత్యధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచుతాయి.
చక్కెరలు ఎక్కువ ఉన్నప్పుడు, అది ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే సైటోకైన్‌ల విడుదలకు దారి తీస్తుంది, దీనివలన కీళ్ళలో వాపులు ఎక్కువ అవుతాయి అని చెప్పారు అఫ్రైన్.
దీర్ఘకాలిక వాపుల కారణంగా కీళ్ల కణజాలం దెబ్బతిని నొప్పి అలాగే బిరుసుగా అయిపోవడం జరుగుతుంది.
ప్రాసెస్ చేయబడిన ఆహారంలోని ప్రిజర్వేటివ్‌లు మరియు ఎడిటివ్‌లు ఆక్సీకరణ ఒత్తిడికి దారి తీస్తాయి, దీని వలన కణాల నష్టం మరియు మరింత ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడుతుంది. “MSG (మోనోసోడియం గ్లుటామేట్), ఇది వంటకానికి రుచిని జోడించినప్పటికీ, ఇన్‌ఫ్లమేషన్ మార్గాలను ప్రభావితం చేస్తుంది మరియు కీళ్లతో సహా శరీరం అంతటా విస్తృతమైన మంట మరియు వాపును ప్రేరేపిస్తుంది” అని అర్ఫైన్ చెప్పారు.
మనకి ఉన్న మార్గాలేమిటి?
ప్రాసెస్ చేసిన ఆహారంలో పీచు పదార్థాలు ఉండవు. ఇది జీర్ణాశయంలో సూక్ష్మజీవావరణాన్ని సరిగ్గా ఉంచడానికి చాలా అవసరం. దీనిలో వచ్చే అసమతౌల్యతల వలన ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీసి కీళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.
“మనం తీసుకునే మోతాదు కీలకం. మనం ఎంత మేర ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నాము అనేది మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు నియంత్రణ లేకుండా వీటిని తీసుకుంటూ ఉంటే, మోతాదులో నియంత్రణ చాలా అవసరం అలాగే ఆహారపు అలవాట్లను అవగాహనతో ఎంచుకోవడం చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది” అని సూచించారు అఫ్రైన్.
కీలక అంశాలు
- ప్రాసెస్ చేసిన ఆహారంలో అనేక చక్కెరలు, ఉప్పులు, ప్రిజర్వేటివ్‌లు వంటివి ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి.
- దీర్ఘకాలిక వాపుల వలన కీళ్ల కణజాలం దెబ్బతిని నొప్పులు అలాగే బిరుసుతనానికి దారి తీస్తుంది.
- మనం తీసుకునే ప్రాసెస్ చేసిన ఆహారం మోతాదు మనపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. మీరు దీనిని నియంత్రణ లేకుండా తీసుకుంటుంటే, వెంటనే నియంత్రించి మీ ఆహార అలవాట్లపై దృష్టి సారించడం కీలకం.